విజయవాడ ఆటోనగర్ ఆ పేరు చెప్తే.. ఎప్పుడూ పనిచేస్తూ రద్దీగా ఉంటే మెకానిక్ దుకాణాలే కనిపించేవి. లాక్డౌన్ వల్ల ఆ దుకాణాల వద్దకు వాహనాలు రాక..సరిపడ రాబడి లేక కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు యజమానులు. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వాహనాల్లో ఎంతటి సమస్య ఉన్నా క్షణాల్లో సరిచేసే నైపుణ్యం ఉన్న ఇంజినీరింగ్ చదవని ఇంజినీర్లు వీరు. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనులతో గడిపే వీళ్లే.. ఇప్పుడు పనుల కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబసభ్యుల కడుపు నింపేదెలా అని దిగాలు చెందుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు సుమారు ఏడాదిన్నరగా విజయవాడ ఆటోనగర్ కార్మికులు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాహనాల రాక తగ్గిపోవడంతో పనుల్లేకే మెకానిక్ షెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. కొవిడ్ మొదటి విడత నుంచి కాస్త కుదుట పడుతున్న సమయంలోనే రెండో దెబ్బ వీరి సమస్యల్ని మరింత తీవ్రతరం చేసింది. ఫలితంగా విజయవాడ ఆటోనగర్ పూర్తిగా కళ తప్పి కష్టాలు ఎదుర్కొంటోంది.
జీతాలు లేక వెతలు
మామూలు రోజుల్లో రోజుకు 800 రూపాయల దాకా వచ్చే సంపాదన ఇప్పుడు పనుల్లేక 200 రూపాయలకు పడిపోయింది. పెట్రోల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో జీవనం సాగించేదెలాగో తెలీక ఆటోనగర్ కార్మికులు సతమతమవుతున్నారు. కొన్ని షెడ్లు, చిన్న కర్మాగారాల యజమానులు నెల జీతాలు తగ్గించి ఇస్తున్నా సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
బతకడం కష్టంగా మారింది
గతంలో పదుల సంఖ్యలో కార్మికులు పనిచేసే చిన్న పరిశ్రమల్లో ఇప్పుడు ఐదారుగురికి మించి ఉండటం లేదు. పనుల్లేక వచ్చిన వారే ఖాళీగా ఉండడం, వేతనాలు సరిపడా రావట్లేదనే భావనతో కొందరు మానేస్తుండటంతో ఆటోనగర్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.
ఇదీ చూడండి:
కర్నూలులో పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 5 కిలోల బంగారం పట్టివేత