రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి తాపీతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. మంత్రిని కలిసేందుకు వచ్చిన నాగేశ్వరరావు అనే వ్యక్తి హఠాత్తుగా తాపీతో దాడికి యత్నించాడు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మంత్రి తల్లి నాగేశ్వరమ్మ పెద్దకర్మ ఆదివారం జరిగింది. దీనికి సంబంధించిన క్రతువును మంత్రి స్వగృహంలో నిర్వహించారు. కార్యక్రమం అనంతరం స్థానిక మార్కెట్టు యార్డులో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు వెళ్లేందుకు మంత్రి బయటకు వచ్చారు. అప్పటికే మంత్రిని పరామర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు. ఈ సమయంలో నాగేశ్వరరవు అనే వ్యక్తి తాపీతో మంత్రిపై దాడి చేసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన పేర్ని నాని అభిమానులు, భద్రత విభాగం అధికారులు, కార్యకర్తలు అతన్ని అడ్డుకున్నారు. నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంత్రి అనుచరుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రిని పరామర్శించేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. హోంశాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ,డీజీపీలు మంత్రి పేర్ని నానిని పరామర్శించారు.
"మా తల్లి పెద్దకర్మ సందర్భంగా పూజాదికాలు నిర్వహించాం. వాటిని పూర్తి చేసుకుని భోజనాల దగ్గరకు వెళ్లేందుకు బయలు దేరాను. అప్పటికే గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువ మంది ఇంటి ముందు ఉన్నారు. వారిని పలకరిస్తూ గేటు దగ్గరకు వెళ్లాను. ఈ సమయంలో ఓ వ్యక్తి తల వంచుకుని కాళ్ల మీద పడుతున్నట్టుగా వేగంగా మీదకు వచ్చాడు. దగ్గరకు వచ్చాక చూస్తే.. ఐరన్ ఏదో పొట్టలో నుంచి తీసి పొడవడానికి ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలో నాకు ఎలాంటి గాయం కాలేదు. అది బెల్డ్ బకెల్‌కి తగలింది. రెండోసారి దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఏదో వంకరగా ఉన్నట్టు కనిపించింది. వెంటనే చుట్టూ ఉన్న వారు అప్రమత్తమై అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను ఎందుకిలా చేశాడో నాకు తెలీదు. నేను బాగానే ఉన్నాను. అతను బలరాంపేటకు సంబంధించిన వ్యక్తి. నేను గుర్తు పట్టాను. నాకైతే ఏమీ కాలేదు. క్షేమంగా ఉన్నాను"
- పేర్ని నాని, మంత్రి
నిందితుడి నేర చరిత్రపై ఆరా
మంత్రి తల్లి పెద్దకర్మ సందర్భంగా అక్కడకు వచ్చిన జనంలో ఉన్న నిందితుడు ఆదివారం ఉదయం 11.30 గంటలకు మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నించాడు. నిందితుడు గొడుగుపేటకు చెందిన బడుగు నాగేశ్వరరావుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మద్యంమత్తులో తన వద్దనున్న తాపీతో దాడికి యత్నించినట్లు విచారణలో తేలిందన్నారు. పనులు లేని కారణంగా మంత్రిని కలసి తన బాధను చెప్పుకునేందుకు వచ్చినట్టు నిందితుడు చెబుతున్నాడన్నారు. ఈ దాడి వెనుక ఎవరైనా ఉన్నారా? ఇది రాజకీయ కోణమా? లేక మరేదైనా ఉద్దేశం ఉందా? అనేది విచారణలో తెలుస్తుందని చెప్పారు. నాగేశ్వరరావు నేరచరిత్రపై కూడా ఆరా తీస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: