ఆషాడమాసంలో శుభకార్యాలు ఉండవు. అందుకే నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. దీనివల్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోయేవి. ఆ క్రమంలో నష్టాల నుంచి గట్టెక్కేలా కొనుగోళ్లు పెంచుకునేందుకు వస్త్ర దుకాణాల వ్యాపారస్తులు ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అది కాస్త ఆషాడమంటే ఆఫర్లు అనే స్థాయికి పెరిగిపోయింది. మిగిలిన రోజుల్లో కంటే ఆషాడంలోనే ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుండటం... ఆఫర్లకు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.
వస్త్ర దుకాణాలతో ప్రారంభమైన బంపర్ ఆఫర్లు.. ఇప్పుడు సెల్‌ఫోన్ షాపులకూ విస్తరించాయి. విజయవాడలో సెల్‌ఫోన్ దుకాణాలు భారీ ఆషాడం ఆఫర్లతో జనాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇక వస్త్ర దుకాణాల సంగతి చెప్పనక్కర్లేదు. ఆషాడం మోసుకొచ్చిన ఆఫర్లతో వస్త్రాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు. మగువలు మెచ్చే చీరలు మొదలు, మోడ్రన్ డ్రస్సులు, చిన్న పిల్లలు, పురుషుల దుస్తులు... 50 నుంచి 70 శాతం డిస్కౌంట్‌కు లభిస్తున్నాయి. దీంతో నగరంలోని అన్ని దుకాణాలూ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సరికొత్త ట్రెండ్ సృష్టించిన కేజీ సేల్స్‌కు ఆషాడంలో భలే గిరాకీ ఉంటోంది. సిల్క్ నుంచి పట్టు చీరల వరకూ... కేజీల్లో తూకం వేసి విక్రయించడం వల్ల మహిళలు బాగా ఆకర్షితులవుతున్నారు. ఆషాడంలో అమ్మకాలు సంతృప్తిగా ఉన్నాయని దుకాణ యజమానులు అంటున్నారు.
ఆఫర్లు బాగున్నాయని, అన్ని రకాల వస్త్రాలు తక్కువ ధరకే లభిస్తున్నాయని కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేశారు. శ్రావణంలో పూజల కోసమూ ఇప్పుడే కొనుక్కుంటున్నామని చెబుతున్నారు.