Village Ward Secretariat Employees: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న ఆయన.. వాటి పరిష్కారానికి ఎపీఎన్జీవో సంఘం అండగా ఉంటుందన్నారు. విజయవాడ గాంధీనగర్ లోని ఎపీ ఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పలువురు ఎపీ ఎన్జీవో సంఘం నేతలు, సచివాలయ ఉద్యోగుల సంఘాల నేతలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తాము ఎదుర్కొంటోన్న సమస్యలను సమావేశంలో ఉద్యోగులు ఏకరువు పెట్టారు.
పనివేళలు ప్రకటించాలి.. శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్యదర్శులకు ఉద్యోగులకు సాధారణ ఉద్యోగుల్లా పనివేళలు కల్పించాలన్న బండి శ్రీనివాస్, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కి సర్వీసు రూల్స్ ను వెంటనే రూపొందించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిపై రాజకీయ పరంగా ఒత్తిళ్లు ఉన్నాయని వీటిని నివారించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని అంశాలూ వర్తింప జేస్తామన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు.
పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి.. శానిటేషన్ సెక్రటరీల పనివేళలు సవరించాలని, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 1పంచాయతీ కార్యదర్శి తో సమానంగా అధికారాలు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా కోరారు. ఎడ్యుకేషన్ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించడం సహా ఆర్బీకేల్లో పనిచేసే వ్యవసాయ శాఖలకు బదిలీలు కల్పించాలన్నారు. ఉద్యోగులకు ప్రొబెషన్ పీరియడ్ లో ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ఆవిర్భవించి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా జగనన్నకు వందనం పేరిట అక్టోబర్ 2న ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు రూల్స్, పదోన్నతి అవకాశాలను కల్పించాలి. శానిటేషన్ సిబ్బందికి పనివేళలు కల్పించాలి. బదిలీల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. - బండి శ్రీనివాస్, ఎపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తా. గ్రామ వార్డు వ్యవస్థ అనేది దేశంలోనే ఎక్కడా లేని విధంగా తీసుకురావడం ఏపీకి గర్వకారణం. 1.35లక్షల మందిని రెగ్యులర్ చేయడం గొప్ప విషయం. - ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
రాష్ట్ర కమిటీ ఎన్నిక సమావేశం తో పాటు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించాం. ఇప్పటివరకు అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. పెండింగ్ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నాం. - ఎం.డి.జాని పాషా, రాష్ట్ర అధ్యక్షుడు, గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్ - ఎం.డి.జాని పాషా,రాష్ట్ర అధ్యక్షుడు,గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్
ఇవి చదవండి..