AP Secretary of Energy Department: రాష్ట్రంలో గత 3-4 రోజులుగా విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 9 గంటల పాటు నిరంతరాయంగా అందిస్తున్నట్లు ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. సాంకేతిక అవాంతరాల వల్ల కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ప్రభుత్వం వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 204 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని... దానికి అనుగుణంగా బహిరంగమార్కెట్ నుంచి 30 మిలియన్ యూనిట్ల వరకూ కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల కనెక్షన్లకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అవాంతరాలు లేకుండా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ. 7 వేల 700 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 2020లో 4 లక్షల 36 వేల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని... 2021లో అవి 2 లక్షలకు దిగొచ్చాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాపిత ఉత్పత్తితో పాటు.. కేంద్రం, ప్రైవేటు ఒప్పందాల ద్వారా.... 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా వస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఇక అధిక డిమాండ్ ఉన్న సమయంలో అప్పటికప్పుడు మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నట్ల ఇంధన శాఖ కార్యదర్శి వెల్లడించారు. ప్రజలపై అదనపు భారం పడకుండా ఉండేందుకే 25 ఏళ్ల విద్యుత్ కాంట్రాక్టులు లేకుండా తాత్కాలికంగా కొనుగోళ్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
బకాయిల విషయంలో ఎలాంటి వివాదం లేదు
తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన బకాయిల విషయంలో ఎలాంటి వివాదం లేదని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. బకాయిల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉత్పన్నమైన రుసుము, పీపీఏ ఒప్పందం వల్ల తెలంగాణ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోందని తెలిపారు.
బొగ్గు నిల్వల ఆధారంగానే విద్యుత్ ఉత్పత్తి
బొగ్గు నిల్వల ఆధారంగానే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్‌కో ఎండీ శ్రీధర్ తెలిపారు. కనీసం 15 రోజుల బొగ్గు నిల్వలు ఉండాల్సినప్పటికీ కేంద్ర నియంత్రణలో ఉన్న కారణంగా ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే చేయగలుగుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు.. అందులో భాగంగానే శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 26 వేల వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగించినట్లు తెలిపింది. ఏడాదిలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వ్యవసాయ విద్యుత్ మీటర్లు బిగిస్తామని స్పష్టం చేసింది.
"సాయంత్రం వేళ రూ.7 వరకు యూనిట్ ధర పెరుగుతోంది. సౌరవిద్యుత్ వల్ల పగటిపూట రూ.2కే మార్కెట్‌లో దొరుకుతుంది. అర్ధరాత్రి వేళ రూ.5లోపే యూనిట్ ధర ఉంటోంది. ధరల వల్లే దీర్ఘకాలిక ఒప్పందాలకు వెళ్లడం లేదు. ఇతర రాష్ట్రాల్లాగే బిడ్డింగ్ చేసి కొనుగోలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా విధానాలు మారడం వల్లే ముందస్తు చెల్లింపులు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంటు కోతలు లేవు" - ఎన్.శ్రీకాంత్, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి
ఇదీ చదవండి: