చింతామణి నాటక ప్రదర్శనను పూర్తిగా నిషేధిస్తే కళాకారుల జీవనోపాధి దెబ్బతింటుందని హైకోర్టు అభిప్రాయపడింది. అభ్యంతరకర భాగాన్ని ప్రదర్శించకుండా కట్టిడి చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని కోరింది. సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు కళాకారులు, రచయితలు, సాహిత్యవేత్తలు, నాటకంపై అభ్యంతరం తెలుపుతున్న వ్యక్తుల భాగస్వామ్యంతో కమిటీ వేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. వారి స్పందనను తెలియజేయాలంటూ విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రస్తుత సినిమాల్లో అశ్లీలతపై ఆందోళన వ్యక్తం చేసింది. చెడును నెమ్మదిగా ప్రజల్లోకి చొప్పిస్తున్నారని పేర్కొంది. చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిల్ వేశారు. నాటకంలో ఓ పాత్రపై అభ్యంతరం ఉన్న కారణంగా మొత్తం నాటకాన్ని నిషేధించడం సరికాదన్నారు. నాటకంపై ఆధారపడిన వారి జీవనాధారం దెబ్బతింటుందన్నారు.
ఇవి చదవండి: