వివిధ శాఖలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లపై పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆన్‌లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టం పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. లక్షల కేసుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఈ వ్యవస్థ పని చేయనుంది.
వివిధ శాఖలపై ఉన్న పిటిషన్ల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రతి విభాగంలో నోడల్ అధికారిని నియమించాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యవస్థ పర్యవేక్షణ ఐఏఎస్ అధికారికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంపై వేసిన పిటిషన్ల పర్యవేక్షించనుంది. ఏజీ, ప్రభుత్వ ప్లీడర్ల కార్యాలయాల్లో ఆటోమేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అన్ని కేసుల వివరాలు రియల్‌టైమ్ డ్యాష్ బోర్డులో ఉంచేలా కసరత్తు మొదలుపెట్టింది. అయా శాఖల్లోని కేసులపై ప్రతి నెలా సమీక్ష చేయాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
పెండింగ్‌లో లక్షకుపైగా కేసులు!
ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల‌్లో రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలై.. పెండింగ్‌లో ఉన్న కేసులు లక్షా 94 వేల మేర ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలతో సంస్థలు, వ్యక్తులు వివాద పరిష్కారం కోసం ఈ రెండు కోర్టుల్లో వేసిన కేసులు లక్షలుగా పేరుకుపోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజూ వివిధ కోర్టుల్లో సుమారు 450 పిటిషన్లు దాఖలు అవుతున్నట్టు అంచనా. ప్రత్యేకించి ప్రభుత్వ శాఖలు, అధికారులపై రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నట్లు తేలింది. గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు కోర్టు ఆదేశాలకు సంబంధించి ధిక్కరణ కేసులు ఉన్నాయని గుర్తించారు.
ఇక ప్రత్యేకంగా ఆర్థిక శాఖ.. వివిధ కోర్టుల్లో ఉన్న 143 పిటిషన్లకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయని పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అడ్వకేట్ జనరల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్లీడర్ల వరకు పెండింగ్ కేసుల పరిష్కారానికి దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఇటీవలే ఆదేశించారు. కోర్టు వివాదాల విషయంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా చూడాలని ప్రభుత్వం జీపీలకు నిర్దేశించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా న్యాయ నిపుణులను ఏర్పాటు చేసుకునే విషయంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వివిధ శాఖలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి:
COURT CASES: ప్రతిరోజూ సర్కార్‌కు వ్యతిరేకంగా కేసులు.. పెండింగ్‌లో లక్షకుపైగా కేసులు