Anganwadi Activists Angry On YSRCP government 2019 ఎన్నికలకు ముందు... తెలంగాణ అంగన్వాడీల కంటే వెయ్యి రూపాయలు వేతనం అదనంగా ఇస్తానన్న ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక మోసం చేశాడని అంగన్వాడీలు విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే బాధ్యత ముఖ్యమంత్రి బంధువుల కంపెనీలకే అప్పగించి నాణ్యత లేని వస్తువులు సరఫరా చేయడం ఎంత వరకు సమంజసమని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాణ్యత లేని సరుకులు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసి.. అంగన్వాడీ కార్యకర్తలను బాధ్యులను చేయడమేంటని ప్రశ్నించారు. వివిధ రకాల యాప్ లు తెచ్చి తమకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
Anganwadi Workers Protest: కదం తొక్కిన అంగన్వాడీలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
తెలంగాణలో అంగన్వాడీ టీచర్లుగా పని చేస్తున్న వారికి 13వేల 650 రూపాయలు ఇస్తుంటే ఏపీలో కేవలం 11వేల 500 మాత్రమే ఇస్తూ తమ వైసీపీ ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. అంగన్వాడీ హెల్పర్లకి తెలంగాణలో 9వేల వేతనం ఇస్తుంటే ఏపీలో 7వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి జగన్.. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని హామీ ఇచ్చి నట్టేట ముంచారని అంగన్వాడీలు దుయ్యబట్టారు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయల వేతనం అదనంగా ఇస్తే టీచర్లకు 14వేల 650 రూపాయలు, హెల్పర్లకు 10వేల వేతనం రావాలన్నారు. అంగన్వాడీలకు అదనపు పని భారం, మానసిక ఒత్తిడి, రాజకీయ వేధింపులు (Political persecution) గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అంగన్వాడీలను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పలు రకాల యాప్ లను తీసుకొచ్చి అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం యాప్ ల మోత మోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆగస్టు నుంచి ఎఫ్ఆర్ఎస్ పేరుతో మరో యాప్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. నాణ్యమైన సెల్ ఫోన్లు లేక, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం (Internet facility) సక్రమంగా లేక లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామన్నారు. అంగన్వాడీలకు యాప్ ల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇవ్వకపోవడంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. ఈ యాప్ ల వల్ల అంగన్వాడీలతోపాటు, లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాస్తవ పని సమయం ఉదయం 9గంటల సాయంత్రం 4 గంటల వరకు... అయితే అధికారుల టార్చర్ కారణంగా రోజుకి 10నుంచి 12గంటల వరకు పని చేయాల్సి వస్తోందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలకు ఇస్తున్న ఏకరూప దుస్తుల విషయంలోనూ నాణ్యత లేని వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Anganwadi Workers Called for Protest: వేధింపులను నిరసిస్తూ.. ఆందోళనకు సిద్ధమైన అంగన్వాడీలు
అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న 50 కేజీల బియ్యం బస్తాలో 47కేజీలు మాత్రమే ఉంటున్నాయని అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలింతలు, చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కందిపప్పు, వేరుశెనగ చిక్కీలు, ఖర్జూరాల్లో నాణ్యత ఉండడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న కోడిగుడ్డు 50 గ్రాములు ఉండటం లేదని కేవలం 35 గ్రాములు మాత్రమే ఉంటుందని అంటున్నారు. గతంలో ఒక నెలకు ఇచ్చే చిక్కీలు 1,250 గ్రాములుంటే ఇప్పుడది.. 250 గ్రాములకు పరిమితమైందని తెలిపారు. బెల్లం 1 కేజీ ఇస్తుంటే ఇప్పుడు 250 గ్రాములకు పరిమితం చేశారు... ఇలా అన్ని రకాల వస్తువుల పరిమాణాన్ని తగ్గించేశారని అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi workers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదీ అన్ని రకాల వస్తువులు అంగన్వాడీ కేంద్రాలకు ఒకేసారి రావడం లేదని దఫాల వారీగా వస్తున్నాయని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. మినీ వర్కర్ అనే పేరుతో వర్కర్ పని, హెల్పర్ పని ఒక్కరి చేత చేయించి.. కేవలం 7వేల వేతనం ఇస్తూ గొడ్డు చారికి చెయ్యిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ భద్రత (Job security) కల్పించాలని, కనీస వేతనాలు మంజూరు చేయాలని, యాప్ ల నుంచి విముక్తి కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల వేధింపులు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మినీ అంగన్వాడీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అంగన్వాడీ కార్యకర్తలు కోరారు. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలపై యాప్ ల మోత మోగిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు పెరిగాయని దుయ్యబట్టారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ రాష్ట్ర సదస్సుకు అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన వస్తువులు సరఫరా చేయడం లేదని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ అతని మనుషులకే అంగన్వాడీలకు సరఫరా చేసే సరుకులు అందజేసే బాధ్యత అప్పగించారని మండిపడ్డారు.
CM Jagan Publicity: ప్రజాధనంతో స్వప్రయోజనం.. 'సంపూర్ణ జగన్ ప్రచార పథకం'.. అన్నింటా అన్న ఫొటోనే..