ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్త పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్ట సవరణ చేయడం దారుణమని మండిపడింది. పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మూడు రోజుల నిరసన దీక్షలు మంగళవారం ముగిశాయి.
శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, పెద్దాపురం, భీమవరం, తణుకు, నిడదవోలు, పాలకొల్లు, విజయవాడ, దాచేపల్లి, నెల్లూరు, తిరుపతి, ఆదోని, నంద్యాల, ప్రొద్దుటూరు తదితర పట్టణాల్లో ఆందోళనలు జరిగాయి. వివిధ కాలనీలు, అపార్టుమెంటు సంఘాలు స్వచ్ఛందంగా ఆందోళనల్లో పాల్గొన్నాయి. కరోనా కష్టకాలంలో ప్రజలపై పన్నుల భారం మోపటం అమానుషమని నేతలు ధ్వజమెత్తారు. కొత్తగా ఎన్నికైన పుర ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టిపెట్టకుండా పన్నులు పెంచుతున్నారని విమర్శించారు.
ఎస్సీ ఉప ప్రణాళికలో భాగంగా జరిగిన అభివృద్ధి పనులకు బిల్లుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఆ భారాన్ని మున్సిపాలిటీల మీద నెడుతోందని దుయ్యబట్టారు. పన్నులభారానికి తోడు.. వివిధ గ్రాంట్ల కోతతో పురపాలికలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మంచి నీరు, డ్రైనేజీ ఛార్జీల పేరుతో ప్రజల్ని పిప్పిచేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: