CM Jagan distributed Tidco houses beneficiaries in Gudivada: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని మల్లయ్యపాలెం లేఅవుట్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అంతకు ముందు టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని.. లబ్దిదారులకు పట్టాలు అందించారు.
నేడు చరిత్ర మార్చేలా చేశాం.. ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ''రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి.. వాటికి అక్కాచెల్లెళ్లను హక్కుదారులుగా చేసి.. చరిత్ర మార్చేలా చేశాం. కట్టేది ఇళ్లు కాదు..ఊళ్లు. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు రూపాయికే ఇస్తామని పాదయాత్రలో ఆనాడూ హామీ ఇచ్చాం. ఈరోజు చేసి చూపించాం. మల్లాయపాలెంలో ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తుంది.'' అని వ్యాఖ్యానించారు.
ఆ లక్ష్యంతోనే మా ప్రభుత్వం పనిచేస్తోంది.. గుడివాడ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై అనంతరం సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని వ్యాఖ్యానించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గుడివాడలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగన్.. ప్రతి పేదవాడు బాగుండాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు.
99శాతం మేనిఫెస్టో అమలు చేశాం.. కృష్ణా జిల్లా గుడివాడలో వాయిదా పడుతూ వచ్చిన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఎట్టకేలకు నిర్వహించారు. గుడివాడ సమీపంలోని మల్లాయపాలెంలో 8 వేల 912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ పంపిణీ చేశారు. ముందుగా టిడ్కో ఇళ్లను పరిశీలించిన సీఎం.. లబ్ధిదారులను కలిసి ముచ్చటించారు. ఆ తర్వాత మహిళలకు ఆస్తి పత్రాలు అందజేశారు. రూపాయికే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నాలుగేళ్లలో 99 శాతం మేనిఫెస్టో అమలు చేశామన్న జగన్.. చంద్రబాబు మాత్రం ఏ వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ప్రజలు గుర్తుకొచ్చారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు తనను అనుమతి అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
గుడివాడ సభలోనూ అదే సీన్.. మరోవైపు గుడివాడలో ఏర్పాటు చేసిన సీఎం సభలో ఎప్పటిలాగే ప్రజలు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. సభ కోసం వివిధ గ్రామాల నుంచి ప్రైవేటు కళాశాలల బస్సుల్లో, స్కూల్ బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చిన ప్రజలు.. సీఎం ప్రసంగం మొదలవకముందే ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోయారు. ఓవైపు భయంకరమైన ఎండ, మరోవైపు తీవ్రమైన దాహంతో వృద్దులు, మహిళలు నానా బాధలు పడ్డారు. సభలో కూర్చోలేక, ఉక్కబోతకు ఉండలేక బయటికి వచ్చేశారు.