అనుకున్నారు. పడగొట్టేశారు. ఇన్నాళ్లూ పరిపాలనకు ఓ కేంద్రంగా ఉన్న ప్రజావేదికను.. భూస్థాపితం చేశారు.
గంటల వ్యవధిలోనే...
రెండేళ్లపాటు ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ప్రజావేదిక కథ ముగిసింది. దాదాపు 10 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో గత ప్రభుత్వం నిర్మించిన ఈ భవనం... నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సీఎం జగన్ కూల్చివేయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేత ప్రక్రియ హుటాహుటిన ప్రారంభించారు. జేసీబీల సాయంతో జోరువానలో ప్రజావేదికను భూస్థాపితం చేశారు.
పర్యవేక్షించిన బొత్స, ఆళ్ల
ప్రజావేదిక కూల్చివేతను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. దగ్గరుండి ప్రక్రియను పూర్తి చేశారు. భారీ బందోబస్తు మధ్య అధికార యంత్రాంగం మంగళవారం సాయంత్రం నుంచి ఈ పనిలో నిమగ్నమైంది.
2017లో అందుబాటులోకి వచ్చింది.... 2019లో నేలకూలింది
రాష్ట్రస్థాయి సమీక్షలు, కలెక్టర్ల సదస్సు వంటి ప్రభుత్వ కార్యాక్రమాల నిర్వహణకు అనుగుణంగా 2017లో ప్రజావేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో అత్యంత హంగులతో ఈ వేదిక నిర్మించారు. నదీచట్టాలు అతిక్రమించి నిర్మించారంటూ కలెక్టర్ల సదస్సులో నేటి ముఖ్యమంత్రి జగన్ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబును ఖాళీ చేయిస్తా: ఆళ్ల
కరకట్టపై అక్రమంగా నిర్మించిన మిగిలిన భవనాలు ఖాళీ చేయిస్తామన్నారు వైకాపా నేతలు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ కట్టడమేనంటున్నారు... మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇప్పటికైనా ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
శ్రేణుల హడావుడి
చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి రహదారినీ తొలగించాలంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుచరులు పలువురు ప్రజావేదిక వద్ద అలజడి సృష్టించారు. అటుగా వెళ్లే రహదారిని తమ భూముల్లోనుంచి వేశారంటూ వారు ఆరోపించారు.