Smita Sabarwal House Incident Updates: పదోన్నతుల విషయం మాట్లాడేందుకే తాను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ నివాసానికి వెళ్లినట్లు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌కుమార్‌రెడ్డి పోలీసులకు తెలిపారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నవారిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. విచారణలో తనతో పాటు 9 మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయం మాట్లాడేందుకు తాను స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. రాత్రివేళ ఎందుకు వెళ్లారని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేదని పేర్కొన్నారు.
Smita Sabharwal House Incident: 1996 గ్రూపు-2లో ఉమ్మడి రాష్ట్రం నుంచి దాదాపు 26 మంది అభ్యర్థుల పోస్టింగులు కోర్టు వివాదంతో రద్దయ్యాయని, 2018లో మళ్లీ కోర్టు జోక్యంతో డిప్యూటీ తహసీల్దార్లుగా పోస్టింగులు వచ్చాయన్నారు. వారిలో 16 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, 10 మందికి తెలంగాణలో పోస్టింగ్‌లు వచ్చాయని, అందులో తాను ఒకడినని డీటీ చెప్పినట్లు వివరించారు.
ఏపీకి వెళ్లినవారికి పదోన్నతులు రాగా తామింకా డీటీలుగానే ఉన్నామని ఈ విషయం చెప్పేందుకు వెళదామనుకున్నానని పేర్కొన్నట్లు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో హోటల్‌లో టీ తాగడానికి వెళ్దామంటూ తీసుకొచ్చి తనను ఇలా ఇరికించారంటూ కొత్త బాబు వాపోయినట్లు చెప్పారు.
అసలేం జరిగిందంటే: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే స్మితా సబర్వాల్ ట్వీట్లకు సదరు డిప్యూటీ తహసీల్దార్(48) ఒకట్రెండుసార్లు రీట్వీట్లు చేశాడు. ఈ క్రమంలోనే రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని వెంట తీసుకెళ్లాడు.
తాను ఫలానా క్వార్టర్‌కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో.. అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్‌ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు తట్టాడు. డోర్ తెరిచిన మహిళా ఐఏఎస్‌కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో నివ్వెరపోయారు.
తేరుకున్న ఆమె.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో మీకు ట్వీట్ చేశానంటూ చెప్పిన డిప్యూటీ తహసీల్దార్.. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని సమాధానమిచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె బయటికి వెళ్లాలని గట్టిగా చెబుతూ కేకలు వేసినట్లు సమాచారం. ఈలోపు భద్రతాసిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: