అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద అమెరికా ప్రభుత్వం మన రాష్ట్రానికి 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందచేసిందని ఏపీ కొవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ప్రకటనలో తెలిపారు. దిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కస్టమ్స్ క్లియరెన్స్ అనంతరం ఈ కాన్సన్ట్రేటర్లను రాష్ట్రానికి తరలించామని ఆయన వెల్లడించారు. ఈ కాన్సన్ట్రేటర్లను అగర్వాల్ ప్యాకర్స్ ద్వారా తూర్పుగోదావరికి 200, పశ్చిమ గోదావరికి 100, కృష్ణా జిల్లాకు 50, శ్రీకాకుళం జిల్లాకు 50 చొప్పున తరలించామని ఆయన తెలిపారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, విశాఖపట్నం జిల్లా పాడేరులో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు అమెరికాకు చెందిన అమెరికన్ ఇండియా ఫండ్ సంస్థ ముందుకొచ్చిందన్నారు.
ప్రతి ఆసుపత్రిలోనూ 92 సాధారణ, 8 ఐసీయూ బెడ్స్తో పాటు 46 సెల్లర్ ఇన్ స్టాండ్స్, సామగ్రిని భద్రపర్చుకునేందుకు 20 కప్ బోర్డులు, ఆస్పత్రి సిబ్బంది కోసం 4 టేబుళ్లు, 30 కుర్చీలతో ఒక వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు . వీటితో పాటు 15 విశ్రాంతి గదులు, 10 ఎల్పీఎం సామర్థ్యంతో 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు. దీనికోసం ప్రతి ఆస్పత్రికి రూ.4 కోట్ల చొప్పున ఏఐఎఫ్ సంస్థ నిధులు సమకూరుస్తుందన్నారు. దీంతో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మారుమూల ప్రాంతాలలో వున్న గిరిజనులకు వైద్య సౌకర్యాలు అందుతాయన్నారు. ఈ సాయం అందిస్తున్న ఎఐఎఫ్ సంస్థను డాక్టర్ అర్జా శ్రీకాంత్ అభినందించారు .
ఇదీ చూడండి. RRR Letter to CM: పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ నియామకంపై రఘురామ లేఖ