అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన 250వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా 13జిల్లాలలో 104నియోజకవర్గ కేంద్రాలు, 206మండల కేంద్రాలు, 379గ్రామాల్లో నిరసనలు నిర్వహించినట్లు తెలుగుదేశం ప్రకటించింది. జేఏసి పిలుపు మేరకు రాజధాని రణభేరిలో రైతులు, మహిళలు, రైతుకూలీలు, కార్మికులు, అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరసన ప్రదర్శనలు జరిపారు.
రణభేరిలో ఢమరుకాలు- డప్పులు, కంచాలు- గరిటల మోతలతో ఆయా ప్రాంతాల వారు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రం కోసం భూములిచ్చాం-రోడ్డున పడ్డాం అంటూ రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు, రైతుకూలీలు భిక్షాటన జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి వినతి పత్రాలు సమర్పించారు. మొక్కలు నాటి నిరసనలు తెలిపారు. 3ముక్కలాటతో రాష్ట్రానికి తలవంపులు తేవద్దని, 5కోట్ల ప్రజల భవిష్యత్తు అంధకారం చేయవద్దన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల జీవితాలతో ఆడుకోవద్దని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తరిమేయవద్దని హితవు పలికారు. ఇప్పటివరకు రాజధాని కోసం మనోవేదనతో 85మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకెంతమంది ఉసురు తీస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి, 13జిల్లాల యువత ఉపాధి కోసమే అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. జేఏసి పిలుపుమేరకు జరిగిన రాజధాని రణభేరి కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. యువకుడి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా