రానున్న మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. తూర్పు బిహార్‌ను ఆనుకొని ఉన్న సబ్- హిమాలయన్ రేంజీ, పశ్చిమ బంగా, సిక్కిం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ ఏపీ పరిసర ప్రాంతాల్లో సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఫలితంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి.
రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచన:
- ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం
ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నట్లు అధికారులు వివరించారు. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
- దక్షిణ కోస్తా ఆంధ్ర..
ఆది, సోమవారాల్లో దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు.
- రాయలసీమ..
ఆది, సోమవారాల్లో రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురవనున్నట్లు తెలిపారు. మంగళవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు నుంచి భారీ వానలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.