Adivasi man takes daughter body on bike: దశాబ్దాలు గడుస్తున్న ఆదివాసి తెగల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటం లేదు. ఓ వైపు ప్రభుత్వాలు గిరిజనుల కోసం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. కనీస సదుపాయాలు అందక పేదలు, మారుమూల ప్రాంత ప్రజలు హృదయవిదారక పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. తాజాగా తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి కన్న కూతురు అనారోగ్యంతో మరణిస్తే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సాయం కోరగా వారు నిరాకరిస్తే.. ప్రైవేటు వాహనాన్ని ఆశ్రయించే స్థోమత లేక ఆ తల్లిదండ్రులు ద్విచక్రవాహనంపైనే ఇంటికి తీసుకెళ్లిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కొత్త మేడపల్లి గ్రామంలో ఆదివాసి కుటుంబానికి చెందిన వెట్టిమల్ల, ఆది దంపతుల మూడేళ్ల కుమార్తె సుక్కి కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుంది. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లే ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను ఏన్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానకు పంపించారు.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖాన్ని దింగమింగుతూ కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సాయం కోరారు. కానీ అంబులెన్స్ సిబ్బంది నిరాకరించారు. ప్రైవేటు వాహనంలో వెళ్దామంటే.. ఆర్థిక స్థోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో చేసేదేమీ లేక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడి ద్విచక్రవాహనాన్ని ఆశ్రయించారు. ఆ యువకుడి బైక్‌పైనే 50 కిలోమీటర్లు చిన్నారి మృతదేహంతో ఆ తల్లిదండ్రులు కొత్త మేడపల్లి చేరుకున్నారు. కన్న కూతురి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైనే ఇంటికి తీసుకెళ్లిన దయనీయమైన ఘటన అందరినీ కలచివేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్స్ సేవలు లేకపోవడంతోనే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: