అవినీతి నిరోధక శాఖ డీజీ కుమార్ విశ్వజిత్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులు నియామకమయ్యారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా సీతారామాంజనేయులుకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. రవాణాశాఖ కమిషనర్‌గా ఎం.టి.కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన రవాణా, రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు.
సమీక్ష జరిగిన రెండు రోజులకే
అనిశా పనితీరుపై సీఎం జగన్ గురువారం సమీక్షించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధక విభాగం (అనిశా) పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. లంచం తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి రావాలని.. అధికారులు, సిబ్బంది మరింత చురుగ్గా, క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. అనిశాలో పనిచేస్తున్న సిబ్బంది ఇకనైనా అలసత్వం వీడాలని హెచ్చరించారు. ఈ సమీక్ష జరిగిన రెండు రోజులకే అనిశా డీజీ బదిలీ కావడం గమనార్హం.
ఇదీ చదవండి:'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'