విజయవాడ సత్యనారాణపురం పోలీసుస్టేషన్ పరిధిలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. మణిక్రాంతి అనే మహిళను భర్తే(ప్రదీప్ కుమార్) అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఆమె తలను చేతిలో పట్టుకుని పోలీస్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అమానుష చర్యను చూసిన స్థానికులు గట్టిగా కేకలు వేయటంతో తలను బుడమేరు కాలువలో పడేసి పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. స్థానిక శ్రీనగర్ కాలనీ 4వ లైనులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రేమించిన వాడే.. ప్రాణం తీశాడు
ఐదేళ్ల క్రితం ప్రదీప్ కుమార్, మణిక్రాంతిలకు ప్రేమ వివాహం జరిగింది. కొన్నాళ్లకు వీరి మధ్య మనస్పర్ధలు పెరిగి తరచూ గొడవలు జరిగేవి. మణిక్రాంతి కుటుంబ సభ్యులు సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో ప్రదీప్‌పై ఫిర్యాదు చేశారు. అతనిపై గతంలో పోలీసులు వేధింపుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారని... బెయిల్‌పై వచ్చిన అతను తమ కుమార్తెను హింసించేవాడని మృతురాలి తల్లి ఆరోపించారు. తన కుమార్తె ఇవాళ షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన సమయంలో బయటకు పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేశాడని ఆమె కన్నీరు మున్నీరయ్యింది. హత్య జరిగిన ప్రదేశాన్ని డీసీపీ విజయారావు పరిశీలించారు. భార్య మణిక్రాంతిని భర్తే హత్య చేసినట్లు గుర్తించామని.. నిందితుడు తలను వేరుచేసి బుడమేరు కాలువలో పడేశాడని వెల్లడించారు. తలను వెతికేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నిందితుడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.