ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ప్రకాశం జిల్లా వ్యక్తికి రూ. 3.25 లక్షలకు టోకరా పెట్టిన ఘటన కృష్ణాజిల్లా కేసరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నెలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తానంటూ కేసరపల్లికి చెందిన మరీదు గంగాధరరావు అనే వ్యక్తి ప్రకాశం జిల్లా బోడవాడమండగుంట గ్రామానికి చెందిన గోగినేని లోకేశ్‌ను మోసం చేశాడు.
బాధితుడు గోగినేని లోకేశ్ గతేడాది కేసరపల్లిలోని ఓ సిమెంట్ దుకాణంలో పనికి చేరాడు. అక్కడ అతనికి నిందితుడు మరీదు గంగాధరరావుతో పరిచయం ఏర్పడింది. పదోతరగతి వరకు చదివిన లోకేశ్‌కు తప్పుడు ధ్రువపత్రాలతో విజయవాడ, తిరుపతిలో ప్రధాన దుకాణ సముదాయాల్లోకి తిప్పుతూ గంగాధరరావు విడతల వారీగా రూ. 3.25లక్షల మేర వసూలు చేశాడు. కొంత కాలానికి గంగాధరరావుపై అనుమానం వ్యక్తం చేసిన లోకేశ్.. గ్రామస్తులను ఆరా తీయగా అతడు గతంలోనూ పలువురిని మోసం చేసినట్లు బాధితుడు తెలుసుకున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. తన వద్దనున్న బంగారంతో పాటు తల్లి నగలను బ్యాంకులో తనఖా పెట్టి గంగాధరరావుకు డబ్బులు ఇచ్చినట్లు లోకేశ్ వాపోయాడు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: INDRAKEELADRI: నేటినుంచి ఇంద్రకీలాద్రిపై.. భవానీ దీక్షలు ప్రారంభం