ప్రభుత్వ పాఠశాలలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మూడో దశ ముప్పు పొంచి ఉందని అంతా భయపడుతున్న వేళ.. చిన్నారులపై వైరస్ ప్రభావం పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బడులు మొదలైన తరుణంలో.. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ కలకలం రేపింది. జిల్లా పరిషత్ పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో.. 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. పెదపాలపర్రు జడ్పీ ఉన్నత పాఠశాలలోనే 10 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అదే విధంగా మరో పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులకు కూడా కరోనా సోకింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
"విద్యార్థులకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాం. 10 మందికి పాజిటివ్ గా ఫలితం వచ్చింది. అందరినీ హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. మిగతా విద్యార్థులకూ పరీక్షలు చేయిస్తాం. డీఈవో ఆదేశాల మేరకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. కరోనా బారిన పడిన విద్యార్థులు చదివే స్కూల్ మొత్తాన్ని శానిటైజ్ చేయిస్తాం. మరో పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి సైతం కరోనా బారిన పడ్డాడు. అతన్ని కూడా హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నాం" - నరేష్, ముదినేపల్లి ఎంఈవో