కోనసీమ జిల్లాలో అల్లర్లకు తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కారణమని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోసం మేధావులు, అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. తెదేపా, జనసేన పార్టీలు మాత్రం ప్రజల ముందు ఒకలా.. వెనుక మరోలా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టారన్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు ప్రజల నుంచి స్పందన కరువైందని.., దీన్ని సహించలేక కులాలు, మతాలకు మధ్య గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. అమలాపురం ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఉపేక్షించం: కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే అమలాపురం లాంటి ఘటనలకు పాల్పడుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిన్నటి ఘటనలో నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల వెనుక ఎలాంటి సంఘవిద్రోహ శక్తులున్నా ఉపేక్షించేది లేదన్నారు.
ఏం జరిగిందంటే : కోనసీమ జిల్లా అమలాపురం మంగళవారం ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇవీ చూడండి