Three People died in a Road Accident: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.. ముమ్మిడివరం పోలీసులు తెలిపిన సమాచారం యానం నుంచి అమలాపురం వైపునకు వెళుతున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలిలో ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రి తరలించిన తర్వాత మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిని దొంగ స్వామి, జే కృష్ణ, రాజేష్‌గా గుర్తించారు. అనిల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. వీరంతా అమలాపురం వాసులుగా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. టిప్పర్ బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది.
అంబులెన్సులో క్షతగాత్రురాలు ఉండగా.. ఆగిన వాహనం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను విశాఖపట్నం తరలిస్తున్న అంబులెన్స్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అప్పటికే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం వర్రెడ పంచాయితీ శివారు గుడ్లపల్లి గ్రామానికి చెందిన మాకాడ వెంకటలక్ష్మి అనే 37 ఏళ్ల మహిళ నివాసం ఉంటుంది.
వెంకటలక్ష్మి.. తన కుటుంబ సభ్యులతో గూడెంకొత్తవీధి మండలం దారకొండలోని దారాలమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన ఆమె.. రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి కుడి కాలు విరిగిపోయింది. పాడేరు ఐటీడీఏకు చెందిన అంబులెన్స్ దారకొండ ఆసుపత్రికి తీసుకొచ్చారు దారకొండ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఆమెను అంబులెన్స్‌లో విశాఖపట్నం కేజీహెచ్ తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో అంబులెన్స్ మొరాయించింది. వాహనంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా.. అంబులెన్స్ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో అంబులెన్స్ సిబ్బంది నర్సీపట్నం నుంచి మరో వాహనం తెప్పించే ప్రయత్నం చేశారు. ఇందుకు గాను సుమారు రెండు గంటల సమయం తీసుకోవడంతో అంబులెన్స్‌లోని క్షతగాత్రురాలు వెంకటలక్ష్మితో పాటు ఆమె బంధువులు తీవ్ర ఆవేదన చెందారు.
ఇవీ చదవండి: