Retired Professor Haragopal : విద్యావ్యవస్థ బలోపేతంతోనే సామాజిక మార్పు ఉంటుందని హరగోపాల్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత అధ్యాపకులు జి.హరగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యావ్యవస్థ గతంలో మాదిరిగా లేదని అన్నారు. మహనీయుల అలోచనకు సంపూర్ణ వ్యతిరేకంగా విద్యావ్యవస్థ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సెమీనార్లో.. ముఖ్య అతిథిగా పొఫెసర్ జీ హరగోపాల్ సతిసమేతంగా పాల్గొన్నారు. పాలకొల్లు డీఎన్ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి ఆధ్వర్యంలో ఈ సెమినార్ను ఏర్పాటు చేశారు.
విశ్రాంత అద్యాపకులు హరగోపాల్ ప్రసంగిస్తూ.. దేశంలో సంపదతో పాటు జీడిపీ పెరుగుతున్న పాలకులు విద్యారంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలకు సంపూర్ణ వ్యతిరేకంగా.. విధ్వంసం జరుగుతోందని అన్నారు. అంబేడ్కర్ దృష్టిలో విద్య కీలకమైన ప్రధానంశామని వివరించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు గ్రాంట్లు లేవని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు లేవని, ఆ దిశగా విద్యార్థులకు ప్రొత్సాహకాలు లేవన్నారు. యూనివర్సిటీ సిబ్బందికి సరైన సమయానికి జీతాలు కూడా అందటం లేదని తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వం విద్యకు కేటాయించిన బడ్జెట్లో కనీసం 40 శాతం కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాల తీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.
అదేకాకుండా పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. విద్యావ్యవస్థను బలంగా తయారు చేసినప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరికి విద్య అందినప్పుడే సమాజమార్పు సాధ్యమవుతుందని తెలిపారు. కానీ, నేటి సమాజం అందుకు భిన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు అధికారంలో ఉన్నప్పుడు.. విద్యా వ్యవస్థలో చిన్న సమస్య ఉందని చెప్పిన వెంటనే సమావేశం ఏర్పాటు చేసే వారని అన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తేనే.. వారిలో ప్రశ్నించేతత్వం అలవడుతుందని తెలిపారు. ప్రశ్నల నుంచే జ్ఞానం అందుతుందని వివరించారు. మహిళా హక్కులు, సాధికారత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంబేడ్కర్ సూచించినట్లుగా.. హుందాగా, ఆత్మగౌరవంతో జీవించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది.. హరగోపాల్ దంపతులను ఘనంగా సన్మానించారు.
ఇవీ చదవండి :