Officials Alerted in the Wake of Pawan Kalyan Visit: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధాన్యం కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల పాలెం గ్రామానికి విచ్చేయనున్నారు. రైతులతో మాట్లాడి.. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు గాను జనసైనికులు రాజుల పాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు.
ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో హుటాహుటిన రాజుల పాలెం గ్రామానికి చేరుకుని ధాన్యం కొంటామని హంగామా చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని.. మీరు ఇప్పుడు హడావుడిగా ధాన్యం కొనడం ఏమిటని జనసైనికులు అధికారులను నిలదీశారు. మధ్యాహ్నం వరకూ ధాన్యంలో తేమ శాతం ఉందని చెప్పిన అధికారులు.. పవన్ కల్యాణ్ వస్తున్నాడని.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసైనికులు అంటున్నారు.
అధికారులు ఏమన్నారంటే: కొనుగోలు చేసిన ధాన్యానికి మిల్లర్లు ఎలాంటి కోత విధించినా తాము ఊరుకోమని.. రైతులకు నష్టం జరిగితే తిరిగి మిల్లర్ల నుంచి ఇప్పిస్తామని తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్పష్టం చేశారు. రైతులు మిల్లర్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. ఎవరైనా సరే అలా అడిగితే తమకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
వాగ్వాదం: ప్రతిపక్ష పార్టీల నేతలు వస్తే కేవలం వైసీపీ ప్రభుత్వంపై నెగిటివ్ కామెంట్స్ మాత్రమే చేస్తారని స్థానిక ఏడీఏ రామ్మోహన్ రావు చెప్పడంతో.. జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలకు, ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆయన క్షమాపణలు చెప్పడంతో.. జనసేన పార్టీ కార్యకర్తలు శాంతించారు. రాజుల పాలెంలో పవన్ కల్యాణ్ పరిశీలించే ప్రదేశానికి వచ్చిన అధికారులు.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో జనసేన కార్యకర్తలు, నేతలు కూడా అక్కడే ఉన్నారు.
"పవన్ కల్యాణ్ పర్యటన అని కాదండీ.. మొన్నటి వరకూ వర్షాలు వచ్చాయి కదా. అప్పుడు రైతులు టార్ఫాలిన్లు కప్పారు. నిన్నటి నుంచి ఎండ వచ్చింది. తేమ శాతం తగ్గిన తరువాత వాటిని తీసుకొని వెళ్తున్నాం. మళ్లీ తుపాను రావచ్చు ఏమోనని ముందు జాగ్రత్త చర్యలుగా ధాన్యాన్ని తరలించడానికి వచ్చాం. ఈ గ్రామంలో ఎక్కువ మొత్తంలో ధాన్యం ఉన్నాయి కాబట్టి అందుకే ముందుగా ఇక్కడికి వచ్చాం. అంతే కానీ పవన్ కల్యాణ్ వస్తున్నారని కాదు. ప్రభుత్వ పరంగా మా పని మేము చేస్తున్నాం". - రవీంద్రనాథ్ ఠాగూర్, తహసీల్దార్
ఇవీ చదవండి: