MINISTER TANETI: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు 5 జిల్లాల్లోని 42 మండలాలపై వరద ప్రభావం పడిందని హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. 554 గ్రామాలు ముంపు బారిన పడినట్లు తెలిపారు. కోనసీమ జిల్లా విల్లి మండలంలోని ముక్తేశ్వరం-తొగరపాయ కాజ్‌వే వద్ద వరద పరిస్థితిని ఆమె పరిశీలించారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టామన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు.
కోనసీమ.. కోనసీమ తీరం అత్యంత ప్రమాదకరంగానే ఉంది. గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలు వరదలోనే మగ్గిపోతుండగా.. కొన్నిచోట్ల వరద ప్రవాహం ఏటిగట్లను తాకింది. రాజోలు నున్నవారిబాడవలో ఏటిగట్టుపై భారీగా వరద నీరు వస్తోంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విలీన మండలాలు వారం రోజులుగా నీటిలోనే మగ్గిపోతుండగా.. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, కూనవరం, వీ.ఆర్.పురం, ఎటపాక మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పునరావాస కేంద్రాల్లో నీరు, విద్యుత్ లేక బాధితుల అవస్థలు పడుతుండగా.. కూనవరం, వీ.ఆర్.పురంలో ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. వరదల్లో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోగా.. వరద తీవ్రతకు సహాయచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
రైతులకు కన్నీళ్లు: గోదావరి వరదలు రైతులను నిండా ముంచేశాయి. ఉద్యాన పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. లంక గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో సాగు చేసిన అరటి, బొప్పాయి, కంద, మొక్కజొన్న, కూరగాయల పంటల్ని వరద సర్వనాశనం చేసింది. వారం, పది రోజులు ఆగితే పంట చేతికొచ్చే దశలో వరద ముంచెత్తి ఆశల్ని చిదిమేసిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో కాస్తో కూస్తో పంటనైనా దక్కించుకుందామని పడవలపై ప్రమాదానికి ఎదురెళుతున్నారు. పక్వానికి రాని అరటి, పూర్తిగా గింజ కట్టని మొక్కజొన్న, చిన్న చిన్న బొప్పాయి కాయలు కోసుకుని ఒడ్డుకు చేరుస్తున్నారు. కానీ ఫలితం దక్కడం లేదు.
కరోనాతో వరుసగా రెండేళ్లు నష్టాలను చవిచూసిన రైతులు ఈ ఏడాది కాస్తా, కూస్తో మిగులుతుందనుకుంటే వరద నట్టేట ముంచేసింది. భూ యజమానులకు ముందుగానే డబ్బులు చెల్లించామని ఇప్పుడు తమ కష్టమంతా నీటిలో కలిసిపోయిందని కౌలు రైతులు(tenent farmers) వాపోతున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి అరటి, బొప్పాయి వంటి పంటలు సాగు చేస్తే పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయిందని గగ్గోలు పెడుతున్నారు. సాహసోపేతంగా వరద నీటిలో ప్రయాణించి తోటల నుంచి పంటను ఒడ్డుకు చేర్చినా మార్కెట్‌లో సరైన ధర దక్కడం లేదని అంటున్నారు.
ఇప్పటికే 5 రోజులుగా పంటలు నీటిలో నానుతున్నాయి. మరో మూడు రోజుల వరకు నీరు బయటికిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. దీనివల్ల మొత్తం పంటలు కుళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు. వరద(Flood water) తగ్గినా అరటి చెట్లు కూలిపోతాయి. నీళ్లలో ఉన్న వంగ, కంద, పచ్చిమిరప, ఇతర కూరగాయ పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లే. రెండు, మూడెకరాలు సాగు చేసిన ప్రతి రైతుకు లక్ష నుంచి 2 లక్షల వరకు నష్టం తప్పదు. పంట పూర్తిగా పక్వానికి రాకపోయినా, వరద భయంతో అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలు కోస్తుండటంతో ఇదే అదునుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. వరద రాకముందు వరకు పొలానికే వచ్చి అరటి గెల 350 రూపాయల చొప్పున కొనుగోలు చేసినవారు నేడు మార్కెట్‌కు తీసుకెళ్లినా 60 రూపాయలకు మించి ఇవ్వడం లేదు. నోటికాడికి వచ్చిన పంట నీటమునిగడంతో చావాలో, బతకాలో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: