కోనసీమ జిల్లా పి.గన్నవరం మాజీ శాసనసభ్యుడు పులపర్తి నారాయణమూర్తి(68) మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన్ను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అమలాపురం నుంచి నారాయణమూర్తి పార్థివదేహాన్ని అంబేద్కర్ కాలనీలోని ఇంటికి తరలించారు. ఆయన భౌతికకాయానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
1996 వరకు ఆయన బీఎస్‌ఎన్‌ఎల్‌లో చిరుద్యోగిగా విధులు నిర్వహించారు. ఉద్యోగంలో ఉండగానే 1996లో జరిగిన ఉప ఎన్నికలో నగరం అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా-భాజపా పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని భాజపాకు కేటాయించారు. ఆ సమయంలో నారాయణమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు తెదేపా టికెట్ రాలేదు. దీంతో భాజపాలో చేరి కొంతకాలం ఆ పార్టీలో కొనసాగి భాజపాను వీడారు. ఆయనకు భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మంచి మనిషి, సౌమ్యుడిగా పులపర్తికి పేరుంది.
ఇవీ చూడండి