కోనసీమ జిల్లా రాజోలు వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామాలు చేయగా.. తాజాగా ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు పీఆర్,ఆర్డీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారు పదవికి రాజీనామా చేశారు. జగన్ ఇచ్చిన పదవితో ప్రజలకు, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆయన అన్నారు.
కోనసీమ జిల్లా లక్కవరంలో ఆ పార్టీ అసమ్మతి నేతల సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. సుమారు 11 ఏళ్లపాటు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ అభివృద్ధి కోసం పనిచేశామని అన్నారు. నేడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమపై వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిపై ఎన్నిసార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా.. స్పందించటం లేదన్నారు. రెండు మూడు పర్యాయాలు ఓడిన ప్రజాప్రతినిధులకు ఉన్నత పదవులు కట్టబెట్టిన జగన్ నియోజకవర్గ వైకాపా పార్టీ బాధ్యతలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు అప్పగించి బొంతు విషయంలో అన్యాయం చేసిందన్నారు. కనీసం ఇంఛార్జ్‌గా కూడా కొనసాగించకుండా అవమానించారని విమర్శించారు. పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బొంతు.. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.
ఇవీ చూడండి