YCP COUNSILORS INITIATION: కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదంటూ వైకాపా కౌన్సిలర్లు సోమవారం ఆమరణ దీక్షకు దిగారు. స్థానిక స్టేషన్‌సెంటర్ బసివిరెడ్డి సత్రం వద్ద కౌన్సిలర్ పితాని కృష్ణ, కరణం రాజ్‌కుమార్ ప్రారంభించిన దీక్షకు ప్రతిపక్ష కౌన్సిలర్ బలుసు శ్రీనివాస్, సీపీఎం, సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కృష్ణ, రాజ్‌కుమార్‌లు మాట్లాడుతూ కొంతకాలంగా పట్టణంలో దుర్వాసనతో కూడిన పసరు రంగు నీటిని సరఫరా చేస్తున్నారని, దీనిపై కౌన్సిల్ సమావేశంలో, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ప్రజలు రోగాల బారిన పడటంతో ముఖ్యమంత్రికి చెడ్డపేరు వస్తోందన్నారు. శిబిరం వద్దకు పురపాలక ఛైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి, కమిషనర్ బీఆర్‌ఎస్ శేషాద్రి, ఇతర కౌన్సిలర్లు వెళ్లి దీక్ష విరమించాలని కోరారు. ఈ క్రమంలో కౌన్సిలర్ పాగా సురేష్‌కుమార్.. రాజ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసుల జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది.
ఐదు నెలలుగా సమస్య ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిరసనకారులు ప్రశ్నించగా.. ఇప్పటిదాకా గుత్తేదారులు ముందుకు రాలేదని, శనివారమే పనులు ప్రారంభించామని కమిషనర్ చెప్పారు. నెలరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని, అప్పటిదాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి సరఫరా చేస్తామన్నారు. అప్పటికీ సమస్య పరిష్కరించకపోతే ఏం చేయాలని దీక్ష చేస్తున్న కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఛైర్‌పర్సన్ కల్పించుకొని 31 మంది కౌన్సిలర్లతో కలిసి నిరాహార దీక్ష చేద్దామని చెప్పడంతో వారు ఆమరణ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: