Mamidada Manikyamba Devi: కష్టమెుచ్చినా, కాలం కలిసి రాక ఇబ్బందులు ఎదురైనా.. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం వాసులు మెుదటిగా మెుక్కుకునేది.. శ్రీ మాణిక్యాంబ దేవికే. ఆదుకో తల్లీ అనగానే.. అమ్మవారు ఆపదల్ని దూరం చేస్తుందని పరిసర ప్రాంత వాసుల విశ్వాసం. తమను చల్లగా కాచే.. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలోని అమ్మవారికి గ్రామస్థులంతా కలిసి భక్తితో 2 కిలోల బంగారు చీరను బహుకరించారు.
పసిడి కాంతులతో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా విశేష పూజలందుకుంటున్న అమ్మవారికి స్వర్ణ చీరను చేయించాలని రెండేళ్ల కిందట నిర్ణయించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామస్థులతో పాటు పరిసర ప్రాంత భక్తుల సహకారంతో విరాళాలు సేకరించి.. 2 కిలోల పసిడితో చీరను, భీమేశ్వర స్వామికి వెండి కవచం చేయించినట్లు చెప్పారు.
అమ్మవారికి స్వర్ణ చీర అలంకరణ సందర్భంగా 108 మంది మహిళలు కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా హోమాలు జరిపారు. అనంతరం బంగారు చీరను అమ్మవారికి అలకరించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
ఇవీ చదవండి: