Officers Detention in Nagulapalli village : కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో శనివారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో హాజరైన అధికారులను వైఎస్సార్సీపీ నాయకుడు వడిశెట్టి నారాయణ రెడ్డి, సర్పంచ్ గౌరీ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు నిర్బంధించారు. తమ సమస్య పరిష్కరించే వరకు అధికారులు విడిచిపెట్టింది లేదని తేల్చి చెప్పారు. సమావేశం జరుగుతున్న భవనం తలుపులు మూసేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక గ్రామంలోని సుమారు 600 పై మందిని ఇళ్ల స్థలాల లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరికి స్థలాలు ఇచ్చేందుకు గ్రామ శివారులో భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆ భూముల్లో మెరక పనులు సర్వే రాళ్లు రోడ్లు స్థలాల విభజన వంటి పనులు చేయకుండా హడావుడిగా మాత్రం అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు అధికారులు ఎటువంటి వివరాలు లేకుండా ఖాళీ పట్టాను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అప్పటి నుంచి తమ స్థలాలు తమకు అప్పగించాలని ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు చుట్టూ తిరిగిన పట్టించుకునే పట్టించుకునే నాధుడే కరువయ్యారు. మిగిలిన గ్రామాల్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకుని గృహ ప్రవేశాలు కూడా చేశారని, తమపై ఎందుకు వింత వివక్ష చూపుతున్నారని వాపోతున్నారు.
దీంతో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని తెలుసుకున్న లబ్ధిదారులు భారీగా అక్కడకు చేరుకున్నారు. అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివిన అనంతరం కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారు. ముందు తమ ఇళ్ల స్థలాల విషయం తేల్చిన తర్వాత కార్యక్రమం జరుపుకోవాలని లేదంటే ఒక్క అధికారులు కూడా బయటకు వెళ్ళనివ్వమని హెచ్చరించారు. హాజరైన అధికారులు ఎంత చెప్పినా లబ్ధిదారులు వినలేదు. దీంతో అధికారులు బయటికి వెళ్లే ప్రయత్నం చేయగా మహిళలు వారిని అడ్డుకునే తలుపులు వేసేసారు.
ఈ నెల 25న సమస్యకు పరిష్కారం చూపుతాం : సుమారు నాలుగు గంటల పాటు వారిని కదలనివ్వకుండా ఉన్న చోటే నిలబెట్టేసారు. తమ సమస్యకు పరిష్కార మార్గం చూపుతూనే బయటికి వెళ్లాలని లేని పక్షంలో మేము కూడా ఇక్కడ ఉండి వంటావార్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక దీనంగా ఉండిపోయారు. ఎంపీడీవో అబ్రహం లింకన్ ఫోన్ ద్వారా మండల ప్రత్యేక అధికారి పుష్ప వాణికి వివరించారు. ఈ నెల 25న ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో మరో సమావేశం నిర్వహించి సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని ఆమె ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
గ్రామంపై కక్ష.. కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం : తనపై కక్షతో స్థానిక ఎమ్మెల్యే పెందెం దొరబాబు కావాలనే నాగలపల్లి గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైకాపా నాయకులు వడిశెట్టి నారాయణరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కన్నా తమ గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇచ్చామన్నారు. ఇంత మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ఎమ్మెల్యే తమ గ్రామంపై కక్ష తీర్చుకుంటున్నారని తెలిపాడు.
తన అవినీతిపై ప్రశ్నించినందుకు నన్ను, గ్రామ సర్పంచ్ అయిన తన భార్య గౌరీ రాజేశ్వరిని దూరం పెట్టారన్నారు. తమపై కోపాన్ని గ్రామంపై చూపించడం ఎంత వరకు తగదు అన్నారు. పైగా ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకుని అభివృద్ధికి దూరంగా పెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తనకంటూ ఉన్న ప్రత్యేక క్యాడర్ను చూసి ఎమ్మెల్యే ఓర్వలేక తన భార్యను సర్పంచ్ చెక్ పవర్ తీయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల తాను వందల కోట్లు అవినీతి చేయలేదని తెలిపారు. ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించకపోతే ఇచ్చిన పట్టాలను కాకినాడ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.