MLC Thota Trimurthulu land Grab: వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ల్యాండ్ సీలింగ్ భూమి కబ్జా చేసి.. ఆక్వా సాగు చేస్తున్నారని కాకినాడ జనసేన నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాజులూరు మండలం పల్లిపాలెంలో 35 ఎకరాల భూమిని ఆక్రమించి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి 5 కోట్ల రూపాయలు రుణం పొందారని తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలని స్పందనలో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.
"తోట త్రిమూర్తులు 35 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి.. దాని పైన బ్యాంకులో 5కోట్ల రూపాయలు రుణం కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో పార్టీ ఆదేశాల మేరకు కలెక్టర్‌ను కలిశాము. ఈ ఆక్రమణ గురించి ఫిర్యాదు చేయగానే కలెక్టర్ అశ్చర్యపోయారు. చర్యలు తీసుకుంటామని అన్నారు." -పంతం నానాజీ, జనసేన పీఏసీ సభ్యుడు
"ప్రభుత్వం స్వాధీనం చేసుకునే సమయంలో లేని వ్యక్తులను సృష్టించి స్థానిక ఎమ్మెల్సీ భూ కబ్జాకు పాల్పడ్డాడు. పార్టీ మారి వైకాపాలో చేరిపోయి ఎమ్మెల్సీగా అధికారం చేపట్టిన తర్వాత.. ఈయన అధికార బలంతో బ్యాంకులో రుణాలు తీసుకున్నారు." -లీలా కృష్ణ, జనసేన నేత
"ల్యాండ్ సీలింగ్ భూమి పేదలకు పంచాల్సిన భూమి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దానిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి. ఈ భూమిపై రుణాన్ని పొందిన వ్యక్తులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి." - శెట్టిబత్తుల రాజబాబు, జనసేన నేత
ఇవీ చదవండి: