Want A New House In Hyderabad Take A Look Here: హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు పుష్కరకాలంగా అందుబాటు ఇళ్లకు కేంద్రంగా ఉంది. మొదట్లో ఈ ప్రాంతాల్లో వ్యక్తిగత ఆవాసాలు వచ్చినా.. భూముల ధరలు పెరగడంతో కొన్నేళ్లుగా బహుళ అంతస్తుల భవనాలకు నిలయంగా మారింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ఇన్నర్‌రింగ్ రోడ్డు నుంచి ముఖ్యంగా తూర్పు హైదరాబాద్‌లోని ఉప్పల్, నాగోలు, వనస్థలిపురం, ఎల్‌బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్, దక్షిణంలోని చాంద్రాయణగుట్ట, అరాంఘర్, ఉత్తరంలో మెట్టుగూడ, తార్నాక నుంచి ఐదారు కిలోమీటర్లు, కొన్నిచోట్ల పది కిలోమీటర్ల దూరంలో బడ్జెట్ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్లాటింగ్ వెంచర్లు సైతం ఉన్నాయి. భూముల ధరలు ఇక్కడ అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఇన్నర్‌కు, అవుటర్‌కు మధ్యలో, కొన్నిచోట్ల అవుటర్‌కు చేరువలో బడ్జెట్ ధరల్లో ఉన్నాయి.
భవిష్యత్తులో మరింత వృద్ధి: ఈ ప్రాంతాలు మున్ముందు జనావాసాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే పలుచోట్ల కాలనీలు విస్తరించాయి. పేరున్న పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఇక్కడ ఉండటం సానుకూలాంశం. మున్ముందు భవనాలు వచ్చినా పచ్చదనానికి ఢోకా లేదు. అటవీ భూములు, పార్కులు రవాణా పరంగా మెట్రోరైలు స్టేషన్లకు పది నుంచి పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు. కొత్తగా లింక్ రోడ్లను జీహెచ్‌ఎంసీ వేస్తోంది. మూసీపై వంతెనల ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ పనుల పూర్తితో జాతీయ రహదారులకు ఆయా ప్రాంతాల నుంచి అనుసంధానం పెరుగుతుంది. ఫలితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం సైతం అవుటర్ లోపల పలు భూములను వేలం వేస్తోంది. ఎక్కువగా పెద్ద ప్లాట్లు ఇందులో ఉన్నాయి. సర్కారు వేలం వేసిందంటే ఆ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని ఒక బిల్డర్ అన్నారు. వీటిలో లేదంటే వీటికి చుట్టుపక్కల వెంచర్లలో కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి వృద్ధి ఉంటుందని చెబుతున్నారు.
అనిశ్చితి వీడి.. అడుగులు వేస్తేనే: జీవో 111, ఇతర కారణాలతో మార్కెట్ కొంతకాలంగా స్తబ్ధుగా ఉంది. జీవో 111పై ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ ప్రాంతాన్ని పరిరక్షిస్తూనే ఎలా అభివృద్ధికి అవకాశం కల్పించాలనే దానిపై కసరత్తు సాగుతోంది. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆంక్షలు ఎత్తివేసినా, కొనసాగినా బాహ్యవలయ రహదారి లోపల రియల్ ఎస్టేట్‌పై పెద్దగా ప్రభావం ఉండదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదంటున్నాయి. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఆస్తుల్లో పెట్టుబడికి ఇది అవరోధం కాదని చెబుతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కొనుగోలుదారులు ఇక్కడి మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారని.. పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
సానుకూలతలు ఇలా: హైదరాబాద్ ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ప్రపంచంలోని అగ్రశేణి టెక్నాలజీ సంస్థలన్నీ తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. మరిన్ని సంస్థలు వస్తున్నాయి. ఐటీనే కాకుండా ఏరోస్పేస్, జీవ సాంకేతికత వంటి పలు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. సిటీ అన్నివైపులా విస్తరిస్తోంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను నగరం కల్పిస్తోంది. దీంతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు పెరిగాయి. ఇక్కడ స్థిర నివాసం ఉండటానికి, స్థలాలపై పెట్టుబడులు పెట్టడానికి వారందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భూముల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. మరింత పెరగకముందే కొనుగోలు చేస్తే పెట్టుబడిపై అధిక రాబడిని ఆశించవచ్చు అని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: