Sailakshmi Chandra: నిలబడలేక.. కనీసం కూర్చోలేక.. భరించలేని నొప్పితో విలవిల్లాడుతున్న ఈ అమ్మాయి సాయిలక్ష్మీచంద్ర సొంతూరు కాకినాడ సమీపంలోని రాయుడిపాలెం. తమ బాధను జగనన్నతో చెప్పుకుందామని వ్యయప్రయాసలకోర్చి వందల మైళ్లు దాటి వచ్చారు సాయిలక్ష్మీచంద్ర తల్లిదండ్రులు. కానీ... జగన్ దర్శనం దొరకలేదు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రతాసిబ్బంది మనసు కరగలేదు. సీఎంను కలిసేందుకు అనుమతించలేదు.
జగన్ దర్శనం దొరక్క దుఖిస్తున్న సాయిలక్ష్మీచంద్ర తల్లిదండ్రుల్ని ఈటీవీ ప్రతినిధులు పలకరించారు. తమ కష్టాలను రోధిస్తూ చెప్పుకున్నారు. చిన్నప్పుడే వెన్నెముక సమస్యతో చక్రాలకుర్చీకి పరిమితమైంది సాయిలక్ష్మీచంద్ర. తల్లిదండ్రులు అనేక ఆస్పత్రులు తిరిగారు. ఇప్పటిదాకా3సార్లు వెన్నుపూసకు శస్త్రచికిత్స చేయించారు. కోలుకోకపోవడంతో,...మరోసారి ఆపరేషన్ అవసరం పడింది. ఆస్తులు పోగేసి,... అప్పులు చేసి, ఇప్పటికే లక్షలు ఖర్చుచేసిన ఆ కుటుంబానికి కొత్తగా అప్పూ పుట్టడం లేదు. కన్నబిడ్డ ఆరోగ్యం నానాటికీ క్షిణిస్తోంది. సీఎం సహాయ నిధి కోసం ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు అన్నవరంలో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టారు. కానీ.. కొనడానికి ఎవరూ రాకుండా..మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్ సహా మరో కానిస్టేబుల్ .. ఇంటికి ఉండే రోడ్డుకు అడ్డంగా గేటు కట్టేశారు.
ఈ గోడ వివాదంపై ఈనాడు-ఈటీవీ కథనాలతో పోలీసులు గతంలో అతి కష్టం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు మించి తదుపరి చర్యలే లేవు. స్పందనలో అనేకసార్లు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోకే తాడేపల్లి వచ్చినట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం జగన్ స్పందించి కానిస్టేబుళ్ల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని.. బాధితులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: