Central Government Objection on Bulk Drug Project: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను కాకినాడలోని (Bulk Drug Park in Andhra Pradesh) తొండంగిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. భూముల లభ్యత ఎక్కువ ఉందన్న కారణం చూపుతూ అనకాపల్లి జిల్లా నక్కపల్లికి ఈ కేంద్రాన్ని మార్చుతూ ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ డెవలపర్‌గా అరబిందో రియాలిటీకి 88శాతం వాటా కట్టబెట్టింది. దీంతో ఈ బల్క్‌డ్రగ్ ప్రాజెక్టు ఏర్పాటుపై కేంద్రం తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలతో 6,940 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏపీకి వస్తుందా.. రాదా అన్న సందేహాలు నెలకొన్నాయి. బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం 2020లో దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. ఏపీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక పోటీపడగా.. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ వద్ద ఏర్పాటుకు కేంద్రం అమోదం తెలిపింది. 2022 ఆగస్టులో6,940 కోట్ల రూపాయల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్కు ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారాన్ని తెలిపింది.
గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో భాగంగా కేంద్రం ఈ బల్క్ డ్రగ్ పార్కుకు వెయ్యి కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. 2024-25 నాటికి బల్క్ డ్రగ్ పార్కును పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే కాకినాడలోని తొండంగి నుంచి ఈ బల్క్ డ్రగ్ పార్కును అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్దకు మార్చాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో ఏపీఐఐసీకి చెందిన భూములు 2 వేల ఎకరాల మేర అందుబాటులో ఉన్నాయని.. ప్రాజెక్టుకు ప్రభుత్వ భూములే ఉండాలని నిబందనలు చెబుతున్నాయని పేర్కోంటూ నక్కపల్లికి తరలిస్తున్నట్టు కేబినెట్ లో తీర్మానించారు.
వాస్తవానికి జాతీయ బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మెజారిటీ భాగస్వామిగా ఉండాలి. అయితే జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు డెవలపర్ గా అరబిందో రియాలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్ధను ఎంపిక చేసి ఆ సంస్థకు ప్రాజెక్టులో 88 శాతా వాటాను ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రాజెక్టు అమలు తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు అరబిందో రియాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రాష్ట్రానికి చెల్లించే జీఏస్టీ రీఎంంబర్సుమెంట్ పొందేలా నిర్ణయం జరిగింది. దీంతో సదరు ప్రైవేటు సంస్థకు 2,225 కోట్ల రూపాయల లబ్ది కలిగేలా ఒప్పందాలు కుదిరాయి.
Industrial Accidents: పరిశ్రమల్లో ప్రాణభయం..తనిఖీల తీరు, నిర్వహణ వ్యవస్థపై సందేహాలు
ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా 79 కోట్ల రూపాయల మేర స్టాంపు డ్యూటీని కూడా అరబిందో రియాలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బల్క్ డ్రగ్ పార్కు ప్రాజెక్టు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కాకుండా ప్రైవేటు డెవలపర్‌తో కూడిన ప్రత్యేక భాగస్వామ్యంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలకమైన బల్క్ డ్రగ్ పార్కు ప్రాజెక్టులో అరబిందో రియాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 88 శాతం మేర వాటా ఎలా ఇచ్చారని కేంద్రం నిలదీసినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించలేదు. తొండంగి వద్ద బల్క్ డ్రగ్ పార్కులో మౌలిక సదుపాయల కల్పన కోసం కేంద్ర ఫార్మాసూటికల్స్ విభాగం 225 కోట్లను కూడా మంజూరు చేసింది. అటు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 133 కోట్లను సైతం విడుదల చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను నక్కపల్లికి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. మొత్తం ప్రాజెక్ట్ ఏర్పాటుపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.
పరిశ్రమలు వచ్చేనా.. ఉద్యోగాలు దొరికేనా..
కాకినాడలోని తొండంగి వద్ద కూడా భూములు ఉన్నప్పటికీ.. ఈ ప్రాజెక్టు డెవలపర్‌గా ఉన్న అరబిందో రియాలిటీ సంస్థ.. భూముల లీజు విషయంలో వెనుకాడటంతోనే నక్కపల్లి తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ వద్ద బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తే మౌలిక సదుపాయాలకు 1,672 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అదే అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తే అదనంగా మరో 600 కోట్లను రాష్ట్రప్రభుత్వం వ్యయం చేయాల్సి ఉంటుంది.
ఈ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వెయ్యికోట్లు గ్రాంట్ ను భరిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రుణంగా సమీకరించాల్సి ఉంది. వాస్తవానికి నక్కపల్లి ప్రాంతంలో ఇప్పటికే ఫార్మా పరిశ్రమల వల్ల కాలుష్యం ఎక్కువైందన్న ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. గతంలో నక్కపల్లిలో ఏర్పాటైన హెట్రో డ్రగ్స్ ప్లాంట్ కారణంగా సముద్ర జలాలు కలుషితం అయ్యాయన్న ఫిర్యాదుపై ఎన్జీటీ కూడా భారీగానే జరిమానా విధించింది. ఇదే సమయంలో బల్క్ డ్రగ్ పార్కును కూడా నక్కపల్లి వద్దే ఏర్పాటు చేయటంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.