YSRCP MPs Not Ready Contest Loksabha Elections: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థుల్లో అయోమయం కొనసాగుతోంది. ఒకరిద్దరు మినహా మిగిలిన సిట్టింగ్ ఎంపీలంతా మళ్లీ లోక్‌సభకు పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. తాము అసెంబ్లీ బరిలో నిలుస్తామంటూ భీష్మించుకుర్చున్నారు. కొత్తవారు సైతం ఎంపీ టిక్కెట్ వద్దంటూ జారుకుంటున్నారు. మంత్రులు సైతం ముఖం చాటేస్తుండటంతో.. వైసీపీ అధిష్టానం కొత్త అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది.
అసలే అధికార పార్టీ ఆపైన 150 ఎమ్మెల్యేల బలం.. 99శాతం హామీలు అమలు చేశామంటూ గొప్పలు.. అంతటి చరిత్ర ఉన్న పార్టీ తరఫున రానున్న ఎన్నికల్లో నిలబడాలంటే ఎంతటి పోటీ ఉంటుందో ఊహించకోవచ్చు. కానీ, రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ స్థానాల నుంచి పోటీకి దిగేందుకు వైసీపీ ఎంపీలు విముఖత చూపుతున్నారు.
టిక్కెట్ ఇస్తామని ఆశ చూపుతున్నా కొత్తవారు ముందుకు రావడం లేదు. రోజురోజుకు మసకబారుతున్న జగన్ ప్రాభావానికి తోడు తెలుగుదేశం - జనసేన పొత్తు ప్రభావం ఉంటుందని కొందరు ముందే కాడిపడేస్తున్నారు. 2019లో 25కి 22 సీట్లను గెలుపొందిన వైసీపీకి.. మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతుండగా అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు మంత్రులను ఈసారి ఎంపీ స్థానాల్లో నిలుపుదామని పార్టీ ప్రయత్నిస్తుంటే.. వారు భయపడి అధిష్ఠానం ముందు మొహం చాటేస్తున్నారని సమాచారం.
రాజధానంటూ జగన్ పదేపదే వల్లెవేస్తున్న విశాఖలోనూ ఆ పార్టీ అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి అయితేనే పోటీ చేస్తానని గట్టి పట్టుబటి కూర్చున్నారు. ఈ క్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు.
వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి విశాఖ నుంచి బరిలో దిగనున్నారని వార్తలు వచ్చాయి. వాటిని బలపరుస్తూ ఆయన అక్కడే ఉండి కొన్నాళ్లు రాజకీయాలు చేశారు. కానీ, ఆ తర్వాత విజయసాయి అక్కడి నుంచి మెల్లగా బయటపడ్డారు. దీంతో విశాఖ ఎంపీ స్థానం ఖాళీగా ఉంది.
గత ఎన్నికల్లోనే శ్రీకాకుళం నుంచి ఎవరూ లేక దువ్వాడ శ్రీనివాస్‌ను బరిలో నిలిపి చేతులు కాల్చుకున్న వైసీపీ.. ఆయన్ను లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించినా ఇప్పటివరకూ కొత్త అభ్యర్థిని ఖరారు చేయలేకపోయింది. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సైతం అసెంబ్లీకే పోటీ చేస్తానంటున్నారు. ఆయన కోరుకున్న అసెంబ్లీ స్థానం ఇప్పుడు ఖాళీ కాకపోవడంతో మరో సీటును వైసీపీ అధిష్ఠానం ఇవ్వజూపింది. అక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో ఈ సారికి అన్యమనస్కంగానే ఎంపీగా బరిలో దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.
వైసీపీ సిటింగ్ ఎంపీల్లో ఎక్కువ మంది ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అరకు, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, బాపట్ల, చిత్తూరు ఎంపీలు అసెంబ్లీ సీట్లు ఆశిస్తున్నారు. కొందరిని వైసీపీ అధిష్టానమే అసెంబ్లీకి పంపాలని నిర్ణయించింది.
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ఇప్పటికే నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసింది. రాజమహేంద్రవరం ఎంపీని రాజమహేంద్రవరం గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గంలో, అనంతపురం ఎంపీని ఉరవకొండలో పోటీ చేయిస్తే ఫలితం ఎలా ఉంటుందనే కోణంలో పార్టీ అధిష్ఠానం సర్వేలు చేయించింది.
కర్నూలు ఎంపీని విధిలేని పరిస్థితులు వస్తే ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే ప్రతిపాదన ఉందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపీగా పోటీ చేయాలని పార్టీ చెబుతున్నా.. ఆయన నిశ్శబ్దంగా ఉంటున్నారని వాదనలున్నాయి. తిరుపతి ఎంపీని గూడూరుకు పంపేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది.
నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు పార్టీ అధినాయకత్వం విభేదించిన వెంటనే ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా గోకరాజు రంగరాజును వైసీపీ నియమించింది. ఆయన క్రియాశీలకంగా ఎక్కడా కనిపించడం లేదు. చివరికి ఆయన్నే ఒప్పించి బరిలోకి దింపనున్నట్లు సమాచారం. ఇటీవల ఓ దివంగత సీనియర్ నటుడి భార్య పేరును వైసీపీ వర్గాలు ప్రచారం చేసినా స్పష్టత రాలేదు.
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయబోనని వైసీపీ అధిష్ఠానానికి చెప్పేశారంటున్నారు. అక్కడ కొత్తవారిని ఎవరినీ తెరపైకి తీసుకురాలేదు. ఓ మాజీమంత్రిని ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నా ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. విజయవాడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీవీ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ పార్టీలో కనిపించలేదు. ఎవరినీ ఇన్‌ఛార్జిగా నియమించలేదు. ఈ స్థానంలో ఇప్పుడు ఒక బీసీ మంత్రిని నిలబెట్టేందుకు వైసీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తున్నా.. ఆయన తప్పించుకు తిరుగుతున్నారంటున్నారు.
గుంటూరులో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాలరెడ్డి తాను గతంలో గెలిచిన నరసరావుపేట లోక్‌సభ స్థానానికి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నా.. సిటింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను గుంటూరుకు మార్చాలన్న పార్టీ ప్రయత్నం కొలిక్కి రాలేదని సమాచారం. గుంటూరులో మాజీ క్రికెటర్ అంబటి రాయుడ్ని బరిలోకి దించేందుకు ఆయన్ను నియోజకవర్గంలో తిప్పినా అది జనంలోకి పెద్దగా వెళ్లలేదనే భావనలో వైసీపీ అధిష్ఠానం ఉందంటున్నారు. ఇప్పటికైతే గుంటూరులో ఎవరన్నది తేలలేదు.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు బరిలో నిలవబోతున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో పోటీ చేసేందుకు సీఎం జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులరెడ్డి కుమారుడు దిల్లీ లిక్కర్ కేసులో చిక్కారు. దీంతో ఒంగోలులో పోటీపై ఇప్పటికీ స్పష్టత లేదు.
YCP Activist on MP ఆ ఎంపీ వల్ల తీవ్రంగా నష్టపోయాను ఆదుకోండి: వైసీపీ కార్యకర్త
హిందూపురంలో కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో వైకాపా 22 స్థానాలు గెలిచినా.. ఇప్పటి వరకు మచిలీపట్నం, కడప, రాజంపేట ఎంపీ స్థానాల్లో మాత్రమే స్పష్టత ఉంది. ఆయా స్థానాల నుంచి మరోసారి వల్లభనేని బాలశౌరి, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి పోటీలో ఉండనున్నట్లు సమాచారం.
జమ్మలమడుగు నుంచి అవినాష్, మరో అసెంబ్లీ స్థానంలో మిథున్‌రెడ్డి పోటీ చేయవచ్చన్న ప్రచారమూ ఉంది. నంద్యాలలో ఈసారి టీటీడీ ఈవో ధర్మారెడ్డి బరిలో దిగుతారని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఆయన కుటుంబంలో నెలకొన్న విషాదం నేపథ్యంలో ఆ ఆలోచన విరమించుకున్నారంటున్నారు. ప్రస్తుత ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డిని కొనసాగించే అవకాశం ఉంది.
YCP MP Protest on temple: గుడి మూసివేతపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆందోళన..వీడియో వైరల్