YSRCP Government Stance on River Water Dispute: వస్తేరానీ కష్టాలు, నష్టాలు రాష్ట్రానికి కదా ఆ శాపాలు. పోతేపోనీ కృష్ణా, గోదావరి నీళ్లు.. ప్రాజెక్టులు నిర్మిస్తేనే కదా అవి అవసరమయ్యేది. ఆయకట్టు ప్రాంతం సాగునీరు లేక బీడు భూమిగా మారిపోతే రైతులకు కదా కన్నీళ్లు.. మాకు ఎందుకు దిల్లీలో ఉండే పెద్దలతో గొడవలు. పోగొట్టుకుంటామా సొంత ప్రయోజనాలు అన్నట్లు సాగుతోంది రాష్ట్రంలో సీఎం జగన్ పాలన. గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుపై నామమాత్రపు లేఖలతో ముఖ్యమంత్రి సరిపెట్టడంతో.. కేంద్రం ఆ దిశగా ముందుగు అడుగులు వేయడం లేదు. ఫలితంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోంది.
సీఎం జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో సాగు, తాగునీటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు. నోరువిప్పి రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా గళం వినిపించింది లేదు. ముఖ్యమంత్రి అసమర్థతతో రాష్ట్రానికి నష్టం కలిగించే కృష్ణా జలాల వివాదాలపై ట్రైబ్యునల్‌కు అదనపు అంశాలు పరిశీలించే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది. మరోవైపు గోదావరి జల వివాదాలు పరిష్కరించాలని, కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ ను ఇంతవరకు పట్టించుకోలేదు.
గోదావరిపై కొత్త ట్రైబ్యునల్ గురించి తెలుగు రాష్ట్రాలు అడగలేదు: కేంద్రం
అదనపు ట్రైబ్యునల్ ఏర్పాటుకు తెలంగాణ సీఎం ఓకే: 2020 అక్టోబర్ 6న దిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ అధ్యక్షతన నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కృష్ణా నదిపై అదనపు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుంటే ట్రైబ్యునల్‌పై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
అక్కడే ఉన్న సీఎం జగన్ దీనిపై తన అసమ్మతిని తెలియజేయకపోవడం కొంపముంచింది. దీంతో కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. గోదావరి నదిపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని అదే అపెక్స్ సమావేశంలో సీఎం జగన్ కోరారు. తెలంగాణ రాష్ట్రం సైతం అంగీకరించింది. ఇంతవరకు ట్రైబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయాన్ని కేంద్రం తీసుకోలేదు.
గోదావరి-కావేరి అనుసంధానం సాకారమయ్యేనా?
గోదావరి జల పంపిణీ అవార్డు ప్రకారమే ప్రస్తుతం: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల పంపకాలకు సంబంధించి వివాదం తలెత్తితే సెక్షన్ 84 (3) కింద కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయవచ్చు. 1980లో గోదావరి జల పంపిణీ అవార్డు తీసుకొచ్చారు. 1975 నుంచి 1980 వరకు వివిధ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాలనే గోదావరి అవార్డుగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు.. 1978 వ సంవత్సరంలో ఆగస్టు 7న కుదుర్చుకున్న ఒప్పందం తప్పా.. మిగిలినవన్ని గోదావరి అవార్డు ప్రకారమే అమలులో ఉన్నాయి.
తెలంగాణ, ఏపీలకు గోదావరిలో నిర్దిష్టంగా నీటి కేటాయింపులు ప్రత్యేకంగా లేవు. వ్యాప్కోస్ అధ్యయనం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి అన్నీ కలిపి 75 శాతం విశ్వసనీయ జలాలు 1,430 టీఎంసీలు ఉన్నట్లు లెక్కించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద వినియోగంలో ఉన్న నీరు 659.691 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన నీరు 116.20 టీఎంసీలు.
నీళ్లు లేవంటూనే ఆ కంపెనీలకు కేటాయింపులు.. ప్రజల కన్నా వారే ముఖ్యమా..!
అసలు కొత్త ట్రైబ్యునల్ అవసరం ఎందుకు: తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల వినియోగం 471.686 టీఎంసీలు. కొత్త ప్రాజెక్టులకు అవసరమైనది 178.116 టీఎంసీలు. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నీరు ఉమ్మడి రాష్ట్రానికి లేనట్లే. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం గోదావరి అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టులు నిర్మిస్తుండటంతో గోదావరి దిగువన ఉన్న ఏపీకి నష్టం కలుగుతోంది.
ఈ క్రమంలోనే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు అవసరమని ఏపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ 450 టీఎంసీల వినియోగంతో ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తుడంగా తర్వాత ఆ వినియోగాన్ని ఏకంగా 714 టీఎంసీలకు పెంచిందని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల దిగువన ఉన్న రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతోంది.
నీరు ఎంత అందుబాటులో ఉందో తేల్చి ప్రాజెక్టుల వారీగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించడంతో పాటు తక్కువగా నీరు ఉన్నప్పుడు ప్రాధాన్యాలు తేల్చేలా ప్రోటోకాల్‌ను కూడా ట్రైబ్యునల్ నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికోసం గోదావరిపై కొత్త ట్రైబ్యునల్‌ను కోరుకుంటున్నా కేంద్రం కనికరించడం లేదు.