YSRCP Government Not Managing Drought Conditions: పాలన అంటే.. రోజూ మూడు సమావేశాలు, అధికారులతో ఆరు సమీక్షలే కాదు.. ముందుచూపుతో ఆలోచించటం. జగన్ ఏలుబడిలో అది లోపించింది. తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా సీఎంకు పట్టడం లేదు. నీటి నిర్వహణలో వైఫల్యం.. రైతుల్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. కష్టపడి సాగుచేసిన పంటలు చేతికందక అన్నదాతల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది.
రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణశాఖ ముందు నుంచీ హెచ్చరిస్తోంది. వర్షాభావం ఏర్పడితే కృష్ణా, సాగర్ డెల్టా పరిధిలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వానికీ తెలుసు. గోదావరిలో వేల టీఎంసీలు సముద్రంలో ఏటా కలిసిపోతాయనీ ఎరుకే. ఐనా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే చేయలేదు.
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు - కరవు పరిస్థితులపై వినతిపత్రం
Drought Conditions in AP: సీఎం జగన్ వైఫల్యానికి సాక్ష్యాలు: ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిన కనీస విషయాన్నీ విస్మరించింది. ఈ నీటి సంవత్సరంలో కృష్ణమ్మ వెలవెలబోయింది. పులిచింతల దిగువన పరీవాహకంలో భారీ వర్షాలు కురిసినా.. ఆ నీరంతా సముద్రం పాలైంది. కృష్ణా ఆయకట్టుకు సరిగ్గా నీరందలేదు. ఎగువన శ్రీశైలం నుంచి మళ్లించిన నీటి నిర్వహణ సరిగ్గా లేక.. రాయలసీమ ఆయకట్టుకూ కష్టాలు తప్పలేదు. తుంగభద్ర నుంచీ సకాలంలో నీళ్లు తీసుకురాలేకపోయారు. ఇంత దుర్భిక్ష పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి కూడా సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై సమీక్షించపోవడం ఆయన వైఫల్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
అదే రైతులకు శాపంగా: దుర్భిక్ష పరిస్థితులు, నీటి నిర్వహణపై ముందే మేల్కోని జగన్ సర్కార్.. కనీసం గత ప్రభుత్వాలు వేసిన ప్రణాళికల్నీ పక్కనపెట్టేయడం రైతులకు శాపంగా మారింది. పల్నాడు కరవు నివారణ పథకాన్ని ఈ నాలుగేళ్లలో పూర్తిచేస్తే సాగర్ డెల్టాకు 80 టీఎంసీల నీళ్లు మళ్లించేందుకు ఆస్కారం ఉండేది.
కృష్ణా పరీవాహకంలో రెండో పంటకు అనుమతి లేదు - కలెక్టర్ డిల్లీరావు
Irrigation Water Management in AP: కక్షారాజకీయాలతో అలంకారప్రాయంగా మిగిల్చారు: చంద్రబాబు హయాంలోనే గోదావరి-పెన్నా అనుసంధాన తొలిదశ పేరుతో ప్రణాళికలు వేసి,టెండర్లు కూడా పిలిచారు. కానీ జగన్ రాగానే రివర్స్ గేర్ వేసేశారు. ఇక కృష్ణా డెల్టాను కరవు నుంచి గట్టెక్కించాలని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలనూ జగన్ తన కక్షారాజకీయాలతో అలంకారప్రాయంగా మిగిల్చారు. ఈ ఏడాది 140 రోజులు మాత్రమే పట్టిసీమ పంపులను వాడారు. వంద టీఎంసీలకు పైగా గోదావరి వరద జలాలను పట్టిసీమ ద్వారా తెచ్చే అవకాశం ఉన్నా పంపుల నిర్వహణకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం
వహించారు.
నిర్వహణ లోపం: ఇక శ్రీశైలం నుంచి నీళ్లు రాకపోయినా, పులిచింతల దిగువన పరీవాహకంలో ఉన్న ప్రవాహాలు వృథా కాకుండా చంద్రబాబు హయాంలో వైకుంఠపురం బ్యారేజి టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పచెప్పారు. ఆ బ్యారేజీ పూర్తిచేస్తే కృష్ణా డెల్టాకు.. ఈ ఏడాది కరవు కోరల నుంచి బయటపడేది. అటు, పట్టిసీమను సరిగా నిర్వహించక పులిచింతల జలాశయం ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. దిగువన దాదాపు 100 టీఎంసీలు వృథాగా సముద్రానికి వదిలేయాల్సి వచ్చింది.
ఎండుతున్న పంటలు, కాపాడుకునేందుకు అన్నదాతల యత్నం - ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపాటు
Irrigation Water Management not in Properly: ఇక సీమ విషయానికొస్తే.. తుంగభద్ర దిగువ కాలువకు రావాల్సిన ఒక్క టీఎంసీ నీరూ సుంకేశుల బ్యారేజీకి రాలేదు. సకాలంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తుంగభద్ర అధికారులకు లేఖ రాయలేదు. ఎస్ఆర్బీసీ కింద ఉన్న లక్ష ఎకరాల ఆయకట్టును తడిపేందుకు గోరకల్లు జలాశయంలో నీళ్లు ఉన్నాయి. కానీ గాలేరు-నగరి వరద కాలువ ద్వారా నీళ్లు మళ్లించాలనే ఆలోచనతో ఎస్ఆర్బీసీ కాలువకు నీరు విడుదల చేయలేదు. దీని వల్ల ఆయకట్టు ఇబ్బందుల్లో పడింది.
కర్నూలు పశ్చిమ ప్రాంతాల్లో కరవు కారకమిదే : అవుకు టన్నెళ్ల నుంచి నీటిని మళ్లించేందుకు రైతులను ఇబ్బంది పెట్టారు. హంద్రీనీవా నీటిని అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఇవ్వకుండా.. చిత్తూరు జిల్లాలోని ‘పెద్ద మంత్రి’ ప్రాంతానికి మళ్లించేశారు. ఇందుకోసం గాజులదిన్నె ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన 3 టీఎంసీల నీటినీ సకాలంలో ఇవ్వకుండా ఆపేశారు. దీనివల్ల కర్నూలు పశ్చిమ ప్రాంతాలు నీరు లేక విలవిల్లాడాయి.
డిస్ట్రిబ్యూటరీలు లేక పనికిరాని జలాలు : గండికోట జలాశయంలో నీళ్లున్నా ఉపయోగించుకునే పరిస్థితుల్లేవు. గాలేరు-నగరి తొలిదశ కింద ఆయకట్టుకు నీళ్లు అందించేలా డిస్ట్రిబ్యూటరీల్ని పూర్తి చేయకపోవడంతో ఆ నీళ్లూ ఉపయోగపడటం లేదు. నీటి నిర్వహణలో సర్కారు వైఫల్యం కరవు తీవ్రతను మరింత పెంచింది.
'అనంత' కరవు కష్టం! ఎండిన చెరువులు, అడుగంటిన బోర్లు - రైతుల కన్నీళ్లు పట్టని వైసీపీ పాలకులు