YSRCP Government Neglecting YSR Jalakala Scheme: నాలుగు సంవత్సరాలలో 2లక్షల బోర్లు ఏర్పాటు చేస్తామంటూ జగన్ గొప్పగా చెప్పిన జలకళ పథకం వెలవెలబోతోంది. దరఖాస్తులు ఆ మేరకు వచ్చినా.. కనీసం పావు వంతు బోర్లు కూడా ప్రభుత్వం వేయలేదు. తవ్విన బోర్లకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న మాట ఇచ్చి తప్పారు. ఏడాది తర్వాత విద్యుత్‌భారాన్ని రైతుపైనే నెట్టేశారు.
"బోరు వేసుకుంటే తప్ప నీటి సౌకర్యం లేని రైతన్నలకు అండగా నిలబడుతూ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 2లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమాని శ్రీకారం చుట్టాము. బోర్లను తవ్వించటం మాత్రమే కాదు. కేసింగ్ పైపింగ్ కూడా అందిస్తాము. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించటమే కాకుండా.. మోటర్లు బిగిస్తాము. బోరుకయ్యే సర్వే ఖర్చుల దగ్గర్నుంచి.. అన్ని ఖర్చులు ప్రభుత్వమో భరిస్తుంది."2020 సెప్టెంబరు 28న వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ చెప్పిన మాటలివి.
నాలుగేళ్లలో 2 లక్షల బోర్లు తవ్విస్తామని ఘనంగా ప్రకటించిన సీఎం.. గత 34 నెలల్లో నామమాత్రంగా 23వేల 115 బోర్లు తవ్వించి మమ అనిపించారు. వీటిలోనూ 2వేల 420 బోర్లకు విద్యుత్తు సౌకర్యం కల్పించారు. అందులో 203 బోర్లకు మాత్రమే మోటార్లు బిగించారు. దీనివల్ల జగన్ చెప్పిన జలకళ అంతా డొల్లేనని తేలిపోయింది. ఈ పథకం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది.
Bhima Mitra: "హామీలు సరికదా.. కనీసం సమస్యలనూ పరిష్కరించలేదు"
సంక్షేమం ఎక్కడ ఉంది సీఎంసారు: ఉచితంగా బోర్లు తవ్వించి బీడు భూముల్లో జలకళ తీసుకొస్తామని సీఎం రైతుల్ని ఆశపెట్టారు. రైతులు కూడా ముఖ్యమంత్రి మాటలు నమ్మి 2లక్షల 32వేల 157 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఇప్పటికి 12.16 శాతం మాత్రమే బోర్లు తవ్వారు. బోర్లు తవ్వడం నుంచి విద్యుత్తు సౌకర్యం, మోటార్ల ఏర్పాటు వరకు అంతా ఉచితమని బీరాలు పలికిన జగన్.. పథకాన్ని ప్రారంభించిన ఏడాది తర్వాత నుంచి విద్యుత్ భారాన్ని రైతులపై నెట్టేశారు. ఒక్కో బోరు వేయడానికి 5 లక్షల రూపాయల ఖర్చు అయిందని అంచనా.! అంటే ఇంకా విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన లక్షా 89వేల 614 బోర్లకు దాదాపు 9వేల 480 కోట్లకుపైగా ఖర్చవుతుంది. ఈ భారమంతా ఇక రైతు బరాయించాల్సిందే. మరి ఇందులో రైతు సంక్షేమం ఎక్కడుంది సీఎంగారూ అని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఈ పథకం ఇలా: గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జలసిరి పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 వేలకుపైగా బోర్లు తవ్వారు. బోరు తవ్వడం, మోటార్, సోలార్ ప్యానల్ ఏర్పాటుకు ఒక్కో యూనిట్‌కు దాదాపు 6 లక్షలు ఖర్చు అయ్యేది. రైతుల భూముల్లో బోర్లు ఉచితంగా తవ్వి మోటార్లను కూడా ప్రభుత్వ ఖర్చుతోనే అందించారు. సోలార్ ప్యానల్ ఏర్పాటుకు ఒక్కో బోరుపై అయ్యే ఖర్చుపై ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి 6 వేల రూపాయలు, ఇతరుల నుంచి 49 వేల రూపాయలు వసూలు చేసేవారు. మిగతా మొత్తాన్ని సబ్సిడీగా ప్రభుత్వం సమకూర్చేది.
రైతులకు ఒరిగిందేమి లేదు: వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ జలసరి పథకం పేరును వైఎస్సార్ జలకళగా మార్చారు. సోలార్‌కి బదులుగా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే విద్యుత్తు బోర్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కానీ రైతులకు ఒరిగిందేమీ లేదు. బోర్లు తవ్విన చోట అందరికీ మోటార్లు ఇవ్వకపోగా దరఖాస్తులు చేసిన రైతుల్లో అత్యధికులు ఇప్పటికీ బోర్లు తవ్వేవారి కోసం ఎదురు చూస్తున్నారు.
"ప్రభుత్వం మారినా వెంటనే జలసిరి అనే కార్యక్రమాన్ని మార్చేసి.. వైఎస్సార్ జలకళ అని పేరు పెట్టారు. గతంలో ప్రభుత్వం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మేలు చేసింది. ఈ పథకం కేవలం ప్రభుత్వం ప్రచారం కోసమే.. రైతులకు మేలు చేసే విధంగా లేదు." -రైతు
"అసలు ఇచ్చిన హామీలు గుర్తున్నాయా. మొదటి నుంచి జలకళ పథకం కింద.. 2లక్షల బోర్లు వేస్తామని వాగ్దానం చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్నా అ పథకాన్ని నీరుగారుస్తున్నారే తప్పా చేసిందేమి లేదు." -రైతు
ప్రకటించిన ఏడాదిన్నరకే మడమ తిప్పిన ప్రభుత్వం: బోర్లు తవ్వి మోటార్లు ఉచితంగా అందిస్తామని మొదట ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం.. విద్యుత్తు సౌకర్యం కోసం అయ్యే ఖర్చుని కూడా భరిస్తామని రెండోసారి హామీ ఇచ్చింది. ఇలా ప్రకటించిన ఏడాదిన్నరకే మడమ తిప్పేసింది. విద్యుత్తు సౌకర్యానికి అయ్యే ఖర్చు రైతులే.. భరించాలని ఆదేశాలిచ్చింది. బోర్లకోసం అత్యధికంగా సన్న, చిన్న కారు రైతులే దరఖాస్తులు చేసుకున్నారు. అనేక చోట్ల తవ్విన బోర్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తవ్విన 23వేల 115 బోర్లలో.. 2వేల 420 బోర్లకే విద్యుత్తు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మిగిలిన చోట్ల రైతులు వారి వల్ల కాదని అంటున్నారు.
Gubbalagutta Exploitation: అధికార పార్టీ నేతల చేయి కలిస్తే.. గుట్టలు గుల్లే