YSRCP Government Lies on Jagananna Vidya Deevena : ఏటా క్రమం తప్పకుండా, త్రైమాసికం పూర్తైన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తున్నారని డిసెంబర్ 29న విద్యాదీవెన నిధుల విడుదల వేదికగా సీఎం జగన్ చెప్పారు. కానీ ఆయన 2023 డిసెంబరు 29న విడుదల చేసిన నిధులు ఎప్పుటివో తెలుసా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చివరి త్రైమాసికం బకాయిలు. దీన్ని క్రమం తప్పకుండా ఫీజు రీయెంబర్స్‌మెంట్ ఇవ్వడం అంటారా? క్రమం తప్పకుండా అబద్ధాలు చెప్పడం అంటారా? పేదపిల్లలు, వారి తల్లిదండ్రుల్ని దగా చేయడం అంటారా?
Vidya Deevena Payment Status : 2023-24 విద్యా సంవత్సరం డిగ్రీ, బీటెక్ మొదటి ఏడాదికి ఆగస్టులో తరగతులు ప్రారంభమయ్యాయి. బీటెక్ మూడు, నాలుగో ఏడాది వారికి జులై 17నుంచి బోధన మొదలైంది. ప్రభుత్వ అకడమిక్ క్యాలండర్ ప్రకారమే డిసెంబరు, జనవరి మొదటి వారంతో సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి. సెమిస్టర్ పూర్తైందంటే సగం విద్యా సంవత్సరం అయిపోయినట్లే. ఐనా ఇంతవరకు ఒక్క త్రైమాసికం ఫీజునూ విడుదల చేయలేదు. బీటెక్ నాలుగో ఏడాది విద్యార్థులకు ఏప్రిల్ 29తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. అంటే మిగిలింది మరో మూడున్నర నెలలే. వారికి ఇప్పటిదాకా మూడు త్రైమాసికాల ఫీజులు విడుదల చేయాల్సి ఉండగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అసలు 2023-24 ఫీజుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ప్రక్రియే ప్రారంభించలేదు.
వాలంటీర్ భర్త పెత్తనం - 'జగనన్న విద్యాదీవెన' రాలేదని విద్యార్థిని తండ్రి ఆత్మహత్యాయత్నం
Pending Jagananna Vidya Deevena Fees : ఒక్కో త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం ఫీజురీయంబర్స్‌కు 680కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈ ఏడాది రెండు త్రైమాసికాలకు కలిపి ఇప్పటిదాకా 13వందల60కోట్లు చెల్లించాలి. కానీ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. కళాశాలల యాజమాన్యాలేమో వెంటనే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. గత డిసెంబరులోసెమిస్టర్ పరీక్షలకు ముందే చాలా కళాశాలలు సగం ఫీజులు వసూలు చేసేశాయి. ఫీజు కడితేనే పరీక్షకు అనుమతిస్తామని యాజమాన్యాలు తెగేసి చెప్పడంతో వేరేదారిలేక తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించారు. ఈ ఏడాది సగం విద్యా సంవత్సరం పూర్తైనా ఒక్క విడత ఫీజూ ఇవ్వలేదు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వస్తే పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? అసలు జగన్ సర్కార్ ఫీజురీయంబర్స్‌మెంట్ ఇస్తుందా? ఎగ్గొడుతుందా? భారాన్ని రాబోయే ప్రభుత్వంపైకి నెడుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
విదేశీ విద్యాదీవెనలోనూ జగన్నాటకం
Pending Fee Reimbursement : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకవేళ ఫీజులు చెల్లించకపోతే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో చాలా యాజమాన్యాలు మార్చిలోపే మొత్తం ఫీజులు వసూలు చేసుకునేలా పిల్లలపై ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు ఫిబ్రవరికే పూర్తిగా ఫీజులు చెల్లించాలని ఇప్పటికే విద్యార్థులకు సూచించాయి. డిగ్రీ కళాశాలలు సైతం ఇప్పటికే సగానికిపైగా ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేశాయి. ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయైనా చెల్లించలేదు.
Student Scholarship in AP : ఫీజుల డబ్బుల్లోనూ ఓట్లు చూసే సీఎం జగన్ గతంలో ఉన్న ఫీజురీయంబర్స్‌మెంట్ విధానాన్ని మార్చేసి గందరగోళం సృష్టించారు. గతంలో ప్రభుత్వం నేరుగా కళాశాలల ఖాతాల్లో పిల్లల ఫీజులు జమచేసేది! డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఓటు హక్కు ఉండడంతో విద్యార్థులు, అతడి తల్లికి కలిపి జాయింట్ ఖాతా తెరిపించి అందులో డబ్బు వేస్తున్నారు. కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వం డబ్బు ఇస్తే తల్లుల ఖాతాల్లోనే పడతాయని, ముందు ఫీజు కట్టాలని తేల్చిచెప్తున్నాయి. లేదంటే సెమిస్టర్ పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలు మాత్రం ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యాల మధ్య నలిగిపోతున్నారు.