ఆపత్కాలంలో కరోనా బాధితుడికి అండగా నిలిచాడు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన నరేశ్ అనే యువకుడు. వైరస్ సోకిన వ్యక్తిని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో డ్రైవర్‌గా మారాడు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే లక్షణాలు లేకపోవటంతో అతడిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే మంగళవారం రాత్రి అతను అస్వస్థతకు గురయ్యారు. బాధితుడికి గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఇబ్బందిగా మారింది. స్థానిక వైద్యులు అతడిని గుంటూరుకు తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో స్థానిక 108 వేరే రోగిని ఆసుపత్రికి తరలించేందుకు వెళ్లింది.
బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానిక వ్యక్తులు కొందరు ఓ ప్రైవేటు అంబులెన్సును సమకూర్చారు. అయితే ఆ అంబులెన్స్ డ్రైవర్ కరోనా రోగిని తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. అదే ప్రాంతానికి చెందిన నరేశ్ అనే యువకుడు తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని... రోగిని అంబులెన్స్ లో తీసుకెళ్తానని ముందుకొచ్చాడు. వెంటనే అధికారులు అతనికి ఓ పీపీఈ కిట్ అందజేశారు. ఆ యువకుడు దానిని ధరించి రోగిని గుంటూరు తీసుకెళ్లాడు. నరేశ్ చూపిన చొరవను స్థానికులు అభినందించారు.
ఇదీ చదవండి