యోగి వేమనను మించిన కవులు చరిత్రలో లేరని.. ఇకపై కూడా జన్మించలేరని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ అన్నారు. యడ్లపాడు మండలం కొండవీడులో బాలభారతి, కొండవీడు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకవి వేమన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. 16వ శతాబ్దంలోనే సమాజ కట్టుబాట్లు, మనిషి ప్రవర్తనలోని లోటుపాట్లను పద్యాల ద్వారా ప్రశ్నించిన గొప్ప కవి వేమన అని కొనియాడారు. ఆయన శైలి ఎవరికీ రాలేదని.. ఆ తర్వాత కూడా ఎవరూ వేమనలాగా సరళమైన భాషలో పద్యాలు రాయలేకపోయారని చెప్పారు.
కొండవీడు అభివృద్ధికి ప్రభుత్వం చేయూత: ఎమ్మెల్యే విడదల రజిని
లోకానికి నీతి నేర్పి చూపిన గొప్ప ఆదర్శకవి యోగి వేమన అని ఎమ్మెల్యే విడదల రజిని కొనియాడారు. మహాకవి శ్రీశ్రీ సైతం తనకు తెలిసిన కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ అని మాత్రమే చెప్పారంటే వేమన ఎంత గొప్ప రచయితో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొండవీడు అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ ఉత్సవాలకు మద్యవిమోచన కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించగా.. జిల్లా అధికారులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: లఘచిత్రంతో.. కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన