చంద్రబాబు పాలనలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని... వైకాపా ప్రభుత్వంలో పారదర్శకంగా పాలన జరుగుతోందని ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. చింతమనేని వంటి నేతలను... చంద్రబాబు వెనకేసుకురావడం దారుణమని వ్యాఖ్యానించారు. జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు... ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా పాలనలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిందని... ప్రస్తుతం సీఎం జగన్ ఆదేశాల మేరకు నిస్పక్షపాతంగా వ్యవరిస్తున్నారని ఉద్ఘాటించారు.
పోలీసులను బెదిరించేలా చంద్రబాబు మాట్లాడటం తగదన్నారు. 18కేసులు ఉన్న చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు అనడం... ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతి పూర్తిగా తగ్గిందని... అవినీతిపరులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. చేతనైతే వైకాపా నేతల అవినీతిని నిరూపించాలని లోకేశ్, చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.
అలా జరగకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతా...
తెదేపా అధినేత చంద్రబాబుకు దమ్ముంటే... న్యాయస్థానాల్లో తనపై విచారణలో ఉన్న అవినీతి కేసులపై విచారణకు సమ్మతి తెలిపాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ''స్టే''లు ఎత్తివేయించుకుంటే అవినీతి కేసుల్లో చంద్రబాబుకు శిక్ష పడటం ఖాయమన్నారు. అలా జరగకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. ఆంగ్లమాధ్యమ విధానంపై... తెదేపా ఆరోపణలు సరికాదని హితవు పలికారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలనుకుంటే... రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ప్రకాశం జిల్లాలో ఆస్ట్రేలియన్ ఆట... అదేంటో తెలుసా...