YCP Leaders Met CM Jagan: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పుల ప్రక్రియ (Constituency Incharges Changes in YCP) ఇంకా కొనసాగుతూనే ఉంది. జగన్ శైలితో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. తరతరాలుగా నియోజవర్గ ప్రజలను అంటిపెట్టుకుని రాజకీయం చేస్తున్న కుటుంబాలు సైతం తట్టా, బుట్టా సర్దుకుని చెప్పిన చోటకు వెళ్లాల్సి వస్తోంది. నాయకుల అండదండలతో ఇన్నాళ్లు నియోజకవర్గంలో తమకు తిరుగేలేదంటూ వ్యవహరించిన ద్వితీయ శ్రేణి నాయకులకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు.
ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ - అవమానంతో పార్టీని వీడుతున్న నేతలు
పార్టీ పెద్దల నుంచి పిలుపు: పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపై వైసీపీలో కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు జాబితాల్లో 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన సీఎం జగన్ మరిన్ని మార్పులు చేస్తున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. పిలుపు మేరకు మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ పెద్దలతో మాట్లాడారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చర్చించారు. మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చిత్తూరు ఎమ్మేల్యే ఆరాని శ్రీనివాసులు సీటుపై చర్చించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మేల్యే అదీప్ రాజ్ క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ సీటు విషయమై చర్చించారు.
27 మందితో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల
సీఎంను కలిసిన హిందుపురం ఎంపీ: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి ముఖ్యమంత్రిని కలిశారు. హిందూపురం లోక్‌సభ స్థానానికి సమన్వయకర్తగా శాంత పేరును ఇప్పటికే ప్రకటించినందున తనకు వేరే ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలోనో, లోక్‌సభ స్థానంలోనో టికెట్ ఇవ్వాలని మాధవ్ సీఎంను కోరారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగేందుకు పోలీసు అధికారి ఉద్యోగాన్నీ వదిలేశానని, ఇప్పుడు ఏ సీటూ లేకుండాపోతే నష్టపోతానని చెప్పినట్లు సమాచారం. అయితే సీటు విషయమై ఎలాంటి హామీనివ్వని జగన్, సీట్ల పంపకాలపై కసరత్తు జరుగుతోందని, చూద్దామని చెప్పినట్లు తెలిసింది. దీంతో అసహనంగానే ఆయన వెనుదిరిగారు.
ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు - అసంతృప్తిలో ఎమ్మెల్యే కుమారుడు
సీఎంను కలిసిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు: విశాఖ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ పేరు పరిశీలనలో ఉన్నట్లు విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ రెండు విషయాలపై సీఎం, మంత్రి మాట్లాడినట్లు తెలిసింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కూడా మంగళవారం సీఎంను కలిశారు.
మొత్తానికి మూడో జాబితాను జగన్ సిద్ధం చేయగా బుధవారం రాత్రి విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. గురువారం వైఎస్సార్సీపి ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.