Pawan Kalyan on Allu Arjun Issue : హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో గోటితో పోయే దాన్ని గొడ్టలి దాకా తెచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా చేశారని, ఇది కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డ చనిపోయారన్న బాధ అల్లు అర్జున్‌లో కూడా ఉందని పవన్ అన్నారు. అయితే అల్లు అర్జున్ తరఫున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని, అంత వివాదం అయి ఉండేది కాదన్నారు. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలచివేసిందని అన్నారు.
అల్లు అర్జున్‌కు చెప్పి ఉండాల్సింది: బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని చెప్పారు. అభిమాని చనిపోతే వెంటనే పరామర్శకు వెళ్లి ఉండాల్సిందని అల్లు అర్జున్ కాకున్నా కనీసం నిర్మాతలైనా వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారని, అల్లు అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయంలో సంధ్య థియేటర్ సిబ్బంది అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ వ్యాఖ్యానించారు.
'అల్లు ఆర్మీ, అభిమానుల పేరుతో వందల కాల్స్ - చంపేస్తామని బెదిరింపులు'
ఒకవేళ చెప్పినా ఆ అరుపుల్లో వినిపించలేదేమో: ఆయన వెళ్లి కూర్చున్నాక అయినా ఘటన గురించి చెప్పి అర్జున్‌ను తీసుకెళ్లాల్సిందని పవన్ పేర్కొన్నారు. ఒకవేళ అర్జున్‌కి చెప్పి ఉన్నా ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమోనని అభిప్రాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసినా అల్లు అర్జున్ అభివాదం చేస్తూ బయటకు వెళ్లారనే ఆరోపణలపైనా పవన్ స్పందించారు. అభిమానులకు అభివాదం చేయకపోతే ఆ నటుడికి పొగరు, బలుపు అని చర్చ పెడతారని చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు.
అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు: మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సిందని, తన వల్ల చనిపోయారనే వేదన అర్జున్‌లో ఉంటుందన్నారు. సినిమా అంటే టీమ్ అని, అందరి భాగస్వామ్యం ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు.
చిరంజీవి ముసుగు వేసుకుని థియేటర్‌కు వెళ్లేవారు: ఇలాంటి ఘటనల్లో తాను పోలీసులను తప్పుపట్టనని పవన్ వ్యాఖ్యానించారు. పోలీసులు ముందుగా భద్రత గురించి ఆలోచిస్తారని అన్నారు. చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు.
రేవంత్ గొప్ప నాయకుడు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనే వివాదం చేశారనే ఆరోపణలపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. రేవంత్‌రెడ్డి అలా చేస్తారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడు కింద నుంచి ఎదిగారని చెప్పారు. వైఎస్సార్సీపీ విధానాల తరహాలో ఆయన వ్యవహరించ లేదన్నారు. తెలంగాణలో పుష్పకు బెన్‌ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారని అలాంటి సందర్భంలో రేవంత్‌రెడ్డిని ఎలా తప్పు బడతామని పవన్ అన్నారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో తనకు తెలియదని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్‌గా వెళ్లి ఉంటే బాగుండేది: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్పారు. రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ లీడర్ అని, ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయని అన్నారు. సలార్, పుష్ప వంటి సినిమాలకు కలెక్షన్లు పెరిగాయని గుర్తు చేశారు. అల్లు అర్జున్‌కు స్టాఫ్ చెప్పి ఉండాల్సిందని, తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్‌గా వెళ్లి ఉంటే బాగుండేదని పవన్ పేర్కొన్నారు.
ముందుగా సినీ పరిశ్రమలో మార్పు రావాలి: మార్పు అనేది ముందుగా సినీ పరిశ్రమలో రావాలని, ఇండస్ట్రీ వాళ్లు కూర్చుని మాట్లాడాలని పవన్ సూచించారు. రాష్ట్రంలో పాపికొండలు వంటి అనేక మంచి లొకేషన్లు ఉన్నాయని, ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరమని అన్నారు. క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలన్న పవన్, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్‌తో దిల్ రాజు భేటీ: మరోవైపు అంతకముందు మంగళగిరి జనసేన కార్యాలయానికి వెళ్లిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ఫంక్షన్ ఏపీలో చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జనవరి 4న రాజమహేంద్రవరంలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని, ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రావాలని పవన్‌ను దిల్ రాజు ఆహ్వానించారు. అదే విధంగా సినీపరిశ్రమ అభివృద్ధిపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
సంధ్య థియేటర్ ఘటన - లైవ్ వీడియో విడుదల చేసిన పోలీసులు
సమస్యలు చాలా ఉన్నాయి : అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కల్యాణ్ స్పందన