గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా నేత పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమయ్యాయి. సత్తెనపల్లి వైకాపా నేత అచ్యుత శివప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక వావిలాల స్మారక పార్కులో వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొందరు కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో కొందరు మద్యం తాగి, డ్యాన్సర్లతో నృత్యాలు చేశారని స్థానికులు తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మద్యపాన నిషేధం కోసం పోరాడిన వావిలాల గోపాలకృష్ణయ్య పేరు మీద ఈ పార్కు ఏర్పాటు చేశారు. ఆయన సమాధి ఉన్న ప్రాంతంలోనే 2019లో ఈ పార్కును నిర్మించారు. అలాంటి చోటే అధికార పార్టీ నేతలు పుట్టినరోజు వేడుకల పేరిట అసభ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయటం విమర్శలకు తావిస్తోంది.
కరోనా సమయంలో వేడుకలు నిర్వహించడానికి పోలీసులు అనుమతి తప్పనిసరి. పార్కులో వేడుకలకు మున్సిపాలిటీ అనుమతి కూడా తప్పనిసరి. మున్సిపాలిటీకి పాలకమండలి లేదు కాబట్టే ప్రత్యేక అధికారి అనుమతి కూడా తీసుకోవాలి. పోలీసులు, ప్రత్యేక అధికారి నుంచి అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మాత్రం అనుమతి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అనుమతులు లేకుండానే అధికార పార్టీ నేతలు ఇలా వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చదవండి : ఆన్లైన్లో విగ్రహాలు బుక్ చేసి..ఆ తరువాత..!