YCP Government Did Not Build Irrigation Water Projects: వైసీపీ పాలనలో సాగునీటి రంగం సంక్షోభంలో చిక్కుకుంది. మాట తప్పను మడమ తిప్పను అంటూనే జలయజ్ఞం ప్రాజెక్టుల విషయంలో జగన్ నాలుక మడతేశారు. ఏడాదిలోనే 6 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేస్తామంటూ గొప్పగా ప్రచారం చేసినా అవి నీటి మూటలుగానే మిగిలాయి. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లవుతున్నా ఇంతవరకు రెండంటే రెండే ప్రాజెక్టులు పూర్తి చేసి చేతులెత్తేశారు. మిగిలినవాటి గడువు ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నా నిధులు లేక ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.
కోటలు దాటుతున్న సీఎం మాటలు.. అధికారంలోకి రాగానే పోలవరంతో సహా గాలేరు- నగరి, హంద్రీనీవా తదితర జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామంటూ ప్రజాసంకల్ప యాత్రలో హామీలు గుప్పించిన సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో కేవలం రెండంటే రెండే నిర్మించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కేవలం వెయ్యికోట్లు కేటాయిస్తే 6 కీలక ప్రాజెక్ట్‌లు పూర్తవుతాయని సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో జగన్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం మాటలు కోటలు దాటడం తప్ప పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
54 ప్రాజెక్టుల్లో పూర్తయినవి రెండే.. సాగునీటి ప్రాజెక్ట్‌లు (Irrigation Water Projects) త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగు నీరు ఇవ్వాలంటూ తొలినాళ్లలో హడావుడి చేసిన జగన్ వాటికి నిధులివ్వడంలో మాత్రం చొరవ చూపలేదు. నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిన ఆరు ప్రాజెక్టులను 2021 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ మొత్తం నిర్మాణంలో ఉన్న 54 ప్రాజెక్టుల్లో పూర్తయినవి రెండంటే రెండే తెలుగుదేశం హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రతి సోమవారం ప్రాజెక్ట్‌ల పురోగతిపై సమీక్షించి పనులు పరుగులు పెట్టించేవారు. కానీ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట్లో కొంత హడావుడి చేసినా ఆ తర్వాత ప్రాజెక్ట్ పనులు పడకేశాయి.
Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు
నిధుల్లేక నత్తనడకన సాగుతున్న పనులు.. వెలిగొండ తొలిదశ ఈ ఏడాది ఆగస్టు నాటికే పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. రెండో దశ డిసెంబర్ నాటికి పూర్తికావాల్సి ఉన్నా ఇప్పట్లో ఆయకట్టుకు నీళ్లిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. వంశధార రెండో భాగం - రెండో దశను 2023 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక. ఆ దిశగా చాలినన్ని నిధులు ఇవ్వడం లేదు. వంశధార - నాగావళి అనుసంధానం పనులు నిధుల్లేక ఎప్పటి నుంచో నత్తనడకన సాగుతున్నాయి. అవుకు టన్నెల్ 2 నిర్మాణాన్ని 2023 ఆగస్టు నాటికే పూర్తి చేస్తామని ప్రకటించినా నెరవేరలేదు. లైనింగు పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే సంక్షోభంలో చిక్కుకుంది.