Worst Roads in Municipal Corporations : ఈ రెండూ తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలే. ఒకచోట రోడ్డు సాఫీగాశుభ్రంగా ఉంటే మరోచోట గోతులు, మురుగు ప్రవహిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు కొన్ని సారూప్యతలున్నాయి. రెండు చోట్లా ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను ఒకటే! అభివృద్ధి పనుల్లో తేడా తప్ప. వైఎస్సార్సీపీ సర్కార్ పిండుకునే పన్నుల్లో ఒక్క రూపాయి వ్యత్యాసం కూడా ఉండదు! మరిపన్నులు ఎందుకు కట్టాలి? ఒకప్పుడు పంచాయతీలుగా ఉండి తిరుపతి నగర పాలక సంస్థలో విలీనమైన తిమ్మినాయుడుపాలెం, రాజీవ్‍కాలనీ, ఎమ్మార్‌పల్లివాసులు ఇప్పుడు ఈ ప్రశ్నలే అడుగుతున్నారు. రోడ్లు, మురికి కాల్వల వంటి కనీస మౌలిక వసతులు కల్పించకపోయినా, వీధి దీపాలు వెలిగే పరిస్థితి లేకపోయినా పన్నులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తిరుపతి నగరపాలికలో శెట్టిపాలెం పంచాయతీ విలీనానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతించింది. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?
Worst Drainage in Municipal Corporations : గుంటూరు జిల్లా మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం చేసిన 21 గ్రామ పంచాయతీలదీ అదే దుస్థితి. మంగళగిరి నుంచి నీరుకొండకు, మంగళగిరి నుంచి బేతపల్లి వెళ్లే రోడ్లు అసంపూర్ణంగా మిగిలాయి. నవులూరులో ఏడాది క్రితం రహదారి పనులు ప్రారంభించారు. కొంతకాలానికే ఆపేశారు. నేటికీ అక్కడ గుంతలు తప్ప రోడ్డు పూర్తి కాలేదు! వడ్డేశ్వరం, కుంచెనపల్లిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక మురుగు రోడ్డెక్కుతోంది. దోమలు దండయాత్ర చేస్తున్నా కనీసం ఫాగింగ్ చేస్తున్న దాఖలాల్లేవు.
రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసం 10నెలలుగా అవస్థలు పడుతున్న నరసన్నపేట జనం
జగనన్న బాదుడుకు బతుకు భారం : మంగళగిరి-తాడేపల్లి నగరపాలికలో పంచాయతీలను బలవంతంగా విలీనం చేసుకున్న ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి మాత్రం చొరవచూపడం లేదు. పైగా జగనన్న బాదుడుకు బతుకు భారమైంది. జీవితం దుర్లభమైంది. పంచాయతీలుగా ఉన్ననపుడు ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించే సర్పంచి, ఉద్యోగులు అందుబాటులో ఉండేవారు.
దోమల స్వైర విహారం : ఏలూరు నగరపాలక సంస్థలో సత్రంపాడు, శనివారపుపేట, చోదిమెళ్ల, కొమడవోలు ,వెంకటాపురం, పోణంగి, తంగెళ్లమూడి పంచాయతీలు విలీనం చేశారు. ఈ ఏడు గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలులేవు. ఒకప్పటి మేజర్ పంచాయతీ వెంకటాపురంలో రహదారుల సమస్య పట్టించుకునేవారే లేరు. సత్రంపాడులోనూ డ్రైనేజీ పొంగుతోంది. దోమలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
Poor Drainage System in Vijayawada : నగరానికి శాపంలా డ్రైనేజీ వ్యవస్థ.. ఎక్కడ చూసినా మురుగే..
విలీనం చేశాక ఉన్న సౌకర్యాలు పోయాయి : ఇక మహా విశాఖ నగరపాలక సంస్థ-GVMCలో విలీనం చేసిన నిడిగట్టు, జేవీ అగ్రహరం, చేపలుప్పాడ, కాపులుప్పాడ, కె.నగరపాలెం పంచాయతీల్లో అభివృద్ధి ఆవగింజంతైనా లేదు. కొత్తరోడ్లు, కాలువల నిర్మాణాలు కొన్ని గ్రామాలకే పరిమితమయ్యాయి. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. చేపలుప్పాడలో పంచాయతీగా ఉన్నపుడు ఏడాదికి 500 రూపాయల ఆస్తి పన్ను చెల్లిస్తే GVMCలో విలీనం చేశాక 15 వందల రూపాయలకు పెరిగింది. విలీనం తర్వాత సౌకర్యాలు పెరగకపోగా గతంలో ఉన్నవీ దూరం అయ్యాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.
మొహం చాటేస్తున్న గుత్తేదారులు : నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్నును ప్రభుత్వం ఏటా 15% చొప్పున ఇప్పటికీ పెంచుతూనే ఉంది. కానీ పంచాయతీల్లో పాత విధానంలోనే ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ స్థానిక సంస్థల్లోని కీలక విభాగాల్లో నిధుల వ్యయం కోసం ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేసి అమలు చేసేవారు.
కీలక విభాగాల పెట్టుబడుల ప్రణాళిక-CIIP పేరుతో నిధులు కేటాయించేవారు. CIIP-1 కింద ప్రతిపాదించిన 6 వేల కోట్ల రూపాయల విలువైన పనుల్లో సగానికిపైగా పూర్తయ్యాక ఎన్నికలు రావడంతో అవరోధం ఏర్పడింది. CIIP-2 పేరుతో ప్రత్యేకంగా రహదారుల అభివృద్ధి కోసం మరో 1,213 కోట్లు కేటాయించింది. కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించి ఉంటే లీన గ్రామాల్లోని ప్రజల సమస్యలకు పరిష్కారం దక్కేది. చేసిన పనులకే సరిగా బిల్లులు చెల్లించని కారణంగా పట్టణ స్థానిక సంస్థల్లో పనులంటేనే గుత్తేదారులు మొహం చాటేస్తున్నారు.