Woman Suicide Attempt at CM Camp Office: భూములను అక్రమంగా ఇతరుల పేరు మీద మార్చి అమ్మేసుకున్నారని.. న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగి విసుగు చెంది ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. బలవన్మరణానికి యత్నించింది.
60 సంవత్సరాల వయస్సున్న శారదావతి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకోవడం సహా ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి స్ధిరపడ్డారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి మొత్తం మొగల్తూరులోనే ఉంది. వీరి భూములు శారదావతి భర్త వేణు ప్రసాద్ తండ్రి పేరిటే మొగల్తూరులో ఉన్నాయి. వీటిని భర్త, కుమారుల పేరిట ఇప్పటి వరకు బదలాయించుకోలేదు. దీంతో తమ భూములు భద్రంగా ఉంటాయని భావించిన బాధితురాలి కుటుంబం.. తమ ప్రమేయం లేకుండానే ఇతరులకు బదిలీ కావడంపై నివ్వెరపోయారు.
తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి.. తమ బంధువులు భూముులు బదిలీ చేసుకున్నారని వాపోయారు. దీనిపై అనేక మంది అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పలుమార్లు స్పందనలో వినతులు ఇచ్చినా.. పట్టించుకోలేదన్నారు.
ఏళ్ల తరబడి కలెక్టర్ కార్యాలయం చుట్టూ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ గత నెలలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్‌ను కలిసి చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు. అందుకు సీఎం క్యాంపు కార్యాలయం మెయిన్ గేట్ వద్ద ఉన్న పోలీసులు నిరాకరించారు. దీంతో తనకు న్యాయం జరగదని నిర్ణయానికి వచ్చిన శారదావతి, తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను.. శరీరంపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. బాధితురాలిని అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
తమకు హక్కుగా ఉన్న భూములను తమ సంతకాలు, సమ్మతి లేకుండా వారి పేరిట మార్చుకున్న బంధువులు.. వాటిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపారు. తమకు భూములు తప్ప వేరే ఇతర ఆధారం లేదని, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన తాము ఇప్పుడు భూములన్నీ కోల్పోయి రోడ్డున పడ్డామని కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.