గుంటూరు జిల్లాలో ఓ లారీ డ్రైవర్ అత్యాశ మహిళ మృతికి కారణమైంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని లారీ ఎక్కిన మహిళ... డ్రైవర్ కాఠిన్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. లారీ పట్టుకుని వేలాడుతున్న మహిళను డబ్బుల కోసం అలాగే ఈడ్చుకుపోవటంతో... దుర్మరణం పాలైంది. తల్లి, తండ్రిని కొల్పోయి అనాథలైన పిల్లల రోదన అందరినీ కంటతడి పెట్టించింది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకి చెందిన రమణతో పాటు ఆమె పిల్లలు కూలీ పనులు చేసుకుంటూ... అవి లేనప్పుడు చెత్తకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంంటారు. భర్త కొన్నాళ్ల క్రితం మరణించడంతో... నలుగురు పిల్లలను పోషించేందుకు... ఆ తల్లి నానా పాట్లు పడుతూ.... లారీ డ్రైవర్ దౌర్జన్యంతో మృత్యువాత పడింది.
గుంటూరు జిల్లాలోని జిందాల్ కంపెనీ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని అమ్ముకుంటే నాలుగు పైసలు వస్తాయన్న ఆశతో... రమణ తన ఇద్దరు పిల్లలు, మరి కొందరితో పాటు.. లారీ ఎక్కి నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై దిగారు. లారీ డ్రైవర్‌కి ఛార్జీ డబ్బులు కింద 100 రూపాయలు ఇచ్చింది. అయితే లారీ డ్రైవర్ 300 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తమ వద్ద లేవని రమణ చెప్పడంతో... వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ ను డ్రైవర్ లాక్కున్నాడు. ఫోన్ కోసం రమణ తమ్ముడి కుమార్తె.... లారీ ఎక్కి ఫోన్ ఇవ్వమని కోరింది. ఫోన్ ఇవ్వకపోగా డ్రైవర్ లారీని ముందుకు పోనిచ్చాడు. దీంతో మేనకోడలి కోసం రమణ కంగారుగా లారీని పట్టుకుంది. ఆమె వేలాడుతూ ఉన్నా.... డ్రైవర్ లారీని అలాగే ముందుకు పోనిచ్చాడు. కొంత దూరం వెళ్లాక పట్టు తప్పి రమణ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి మృతితో కుమారులు, కుటుంబసభ్యుల కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు కంటతడి పెట్టించింది.
300 రూపాయల కోసం లారీ డ్రైవర్ పాశవికంగా వ్యవహరించి మహిళ మృతికి కారణమయ్యాడని రమణ బంధువులు ఆరోపిస్తున్నారు. తండ్రి లేని పిల్లలకు అన్నీ తానై సాకుతున్న తల్లి కూడా మృతి చెందడంతో.... చిన్నారులు అనాథలుగా మారారని ఆవేదన వెలిబుచ్చారు.
సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆసుపత్రికి వచ్చి మృతురాలు కుటుంబసభ్యులను పరామర్శించారు. తల్లి, తండ్రిని కోల్పోయి రోడ్డునపడిన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని, 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లారీ డ్రైవర్ కోసం పోలీసులు అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు. WB-23C, 4372 నంబర్‌తో ఉన్న కంటైనర్ లారీ ఈ ఘటనకు కారణంగా గుర్తించారు. లారీ కోసం జాతీయ రహదారితో పాటు సమీపం ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: