గుంటూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ విషయంలో హైడ్రామా జరిగింది. మాచర్ల జడ్పీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బాలు నాయక్తో వైకాపా నాయకులు బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేశారు. అక్కడ తెదేపా, స్వతంత్రులు ఎవరూ పోటీ చేయలేదు. జనసేన నుంచి బాలూనాయక్ మాత్రమే నామినేషన్ వేశారు. మాచర్ల జడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు అతనిపై ఒత్తిడి తెచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే అనుచరులు అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని గుంటూరు జడ్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
నామినేషన్ ఉపసంహరణ ముగుస్తున్న సమయంలో బాలూ నాయక్ని హడావుడిగా ఎన్నికల అధికారుల వద్దకు తీసుకెళ్లారు. అతను నామినేషన్ వెనక్కు తీసుకునేందుకు నిరాకరించాడు. అతనితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలు పెట్టించారు. అనంతరం బయటకి తీసుకొచ్చి వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ తంతుని చూస్తూ అక్కడున్న అధికారులు, పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించారు. మాచర్ల జడ్పీటీసీకి పోటీ లేని కారణంగా.. ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇవీ చదవండి: